అనధికార కాలనీల రిజిస్ట్రేషన్ సాఫీగా జరిగేనా!

1 Apr, 2015 23:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘నగరంలోని అనధికార కాలనీలను క్రమబద్ధీకరించేందుకు తమ ప్రభుత్వం త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభించనుందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటోంది. కానీ ఇది బీజేపీని దెబ్బతీయడం కోసం, పార్టీ అంతర్గత కలహాల నుంచి దృష్టి మళ్లించడం కోసం ఆప్ వేసిన పాచిక. అయితే అనధికార కాలనీల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయడం ప్రకటన చేసినంత సులువేమీ కాదు’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అనధికార కాలనీలను క్రమబద్ధీకరించిన క్రెడిట్ దక్కించుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం తొందరపాటుతో నిర్ణయం తీసుకుందని, లేఅవుట్ ప్లాన్లు సిద్ధంగా లేకుండా రిజిస్ట్రేషన్ చేపట్టడం వల్ల ఎదురయ్యే ఇక్కట్లపై లోతుగా అధ్యయనం చేయలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

షీలాదీక్షిత్ పెద్ద ఉదాహరణ : 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న షీలాదీక్షిత్ అనధికార కాలనీలను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించి విజయం సాధించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు షీలాదీక్షిత్ 895 కాలనీలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొని ప్రొవిజనల్ సర్టిఫికెట్లను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా అందించారు. కానీ ఆ హామీలు నెరవేరలేదు.

2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అనధికార కాలనీలను క్రమబద్ధీకరించనున్నట్లు హామీలు కురిపించాయి. దీంతో అనధికార కాలనీల క్రమబద్ధీకరణ కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతుందని భావిస్తోన్న తరుణంలో ఆప్ సర్కారు అనధికార కాలనీల సరిహద్దులను నిర్ధారించి, రిజిస్ట్రేషన్ జరపనున్నుట్లు ప్రకటించి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసింది.

సరిహద్దుల నిర్ధారణ కాంగ్రెస్ హయాంలోనే..

నిజానికి 895 కాలనీల సరిహద్దులను నిర్ధారించడం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, ఇప్పుడు ఆప్.. కాంగ్రెస్ చేసిన పనికి క్రెడిట్ కొట్టేయాలనుకుంటోందని కొందరు అధికారులు అంటున్నారు. 2012లో అనధికార కాలనీలలో మౌలిక సదుపాయాలను కల్పించాలన్న డిమాండ్ పెరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనధికార కాలనీల సరిహద్దులను నిర్ధారించి లేఅవుట్ ప్లాన్ల తయారీ కోసం మున్సిపల్ కార్పొరేషన్లకు పంపింది. కానీ కాగితాలపై పేర్కొన్న కాలనీల సరిహద్దులకు, వాస్తవంలో కాలనీలకు పొంతన లేకపోవడంతో చివరకు 9 కాలనీలు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించాయి. అయితే ఈ కాలనీల రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇంతవరకు వెలువడనందువల్ల వాటిలో కూడా రిజిస్ట్రేషన్ ఆరంభించలేదు.

లేఅవుట్ ప్లాన్ల తయారీకి వేచిచూడకుండానే రిజిస్ట్రేషన్: ఆప్

రెవెన్యూ విభాగం సరిహద్దులను నిర్ధారించిన వెంటనే వాటిని లేఅవుట్ల తయారీ కోసం మున్సిపల్ కార్పొరేషన్లకు పంపి,వాటి వివరాల కోసం వేచిచూడకుండానే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని ఇప్పుడు ఆప్ సర్కారు ప్రకటించింది. కానీ లేఅవుట్ ప్లాన్లను తయారుచేయకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడం గందరగోళానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లు, పాఠశాలలు, పార్కులు, ఇతర సదుపాయాల కోసం స్థలం వదిలారు.

దీని ప్రకారం ఎమ్సీడీ లేఅవుట్ ప్లాన్ తయారవుతుందని, లేఅవుట్ ప్లాన్ తయారుకాక ముందే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తే ప్రజలు పార్కులు, రోడ్లు, స్కూళ్ల స్థలాన్ని కూడా తమ పేరున రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రమాదం కనిపిస్తోంది. బీజేపీ అధిక్యతలోనున్న ఎమ్సీడీపై పైచేయి సాధించే తాపత్రయంతో ఆప్ సర్కారు తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం మరింత గందరగోళానికి దారితీసి, అనధికార కాలనీల సమస్యను మరింత జటిలం చేసేట్టుగా ఉంది.

మరిన్ని వార్తలు