అడవిలో అనూహ్య విషాదం

28 Jul, 2017 16:35 IST|Sakshi
ఏనుగుతో ఫొటో దిగుతున్న అభిలాష్‌ (ఫైల్‌)
  • సెల్ఫీ, ఏనుగు వెంట్రుకల కోసం ప్రయత్నం ! 
  • ఏనుగు దాడిలో యువకుని మృతి
  •  
    బెంగళూరు: అక్రమంగా బెంగళూరు బన్నేరుఘట్ట అటవీ ప్రాంతంలోకి చొరబడ్డ యువకుడు ఏనుగు దాడిలో మరణించిన ఘటన మూడురోజులు ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. బెంగళూరు గిరినగర్‌కు చెందిన అభిలాష్‌ (27) స్నేహితులతో కలసి మంగళవారం బన్నేరుఘట్ట అటవీప్రాంతంలోకి అక్రమంగా బైక్‌పై ప్రవేశించారు. జూకు సెలవు కావడంతో బైకును హక్కిపిక్కి తెగ ప్రజలు నివాసముంటున్న ప్రాంతంలో వదిలేసి కాలినడకన అడవిలోకి వెళ్లారు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో కొన్ని పెంపుడు ఏనుగులు ఉండడాన్ని గమనించారు. మావటీలు  వెళ్లిపోగానే ఏనుగుల వద్దకు చేరుకున్నారు.
     
    ఆ సమయంలో ఏనుగుల గుంపులోని సుందర్‌ అనే ఏనుగు అభిలాష్, అతడి స్నేహితులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఊహించని పరిణామంతో అభిలాష్‌ స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే  అభిలాష్‌ ఏనుగుకు దొరికిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొద్దిసేపటి అనంతరం అక్కడికి చేరుకున్న మావటీలు అభిలాష్‌ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
     
    ముందునుంచీ సెల్ఫీల మోజు 
    మొదటినుంచీ అభిలాష్‌కు సెల్ఫీల మోజు ఎక్కువగా ఉందని, గతంలో కూడా బన్నేరుఘట్టతో పాటు అనేక జూలలో ఏనుగులతో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసిక్తి ప్రదర్శించేవారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఏనుగు వెంట్రుకలను ఉంగరంగా ధరిస్తే అదృష్టం వరిస్తుందని ఎవరో చెప్పడంతో వాటిని ఎలాగైనా సంపాదించాలని స్నేహితులతో చెప్పేవాడు. ఏనుగుల వెంట్రుకల కోసమే అభిలాష్‌ బన్నేరుఘట్ట అటవీప్రాంతంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో వెంట్రుకల కోసం ఏనుగు తోకను గట్టిగా లాగి ఉంటాడని, దీంతో ఏనుగు కోపంతో అతనిపై దాడి చేసిందని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు