ఏనుగు దాడిలో కూలీ బలి

9 Nov, 2023 08:22 IST|Sakshi

బనశంకరి: అడవి ఏనుగు దాడిలో మహిళా కూలీ బలి కాగా ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా అల్దూరు జోన్‌లో బుధవారం చోటుచేసుకుంది. హెడదాళు గ్రామానికి చెందిన మీనా (45) మృతురాలు. గాయపడిన ఇద్దరు కార్మికులను జిల్లా ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉంది.

తోటకు వెళ్తుండగా
మీనా ఇద్దరు కార్మికులతో కలిసి తోటకు వెళుతున్న సమయంలో అడవి ఏనుగు దాడిచేసింది. తొండంతో కొట్టి తొక్కివేయడంతో మీనా అక్కడిఅక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు వెళ్లి మృతదేహంతో పాటు గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత నెలరోజులనుంచి అల్దూరు, అరేనూరు, హెడదాళు గ్రామాల్లో సంచరిస్తున్న అడవి ఏనుగులు మందలో గున్న ఏనుగు వేరు పడింది. ఈ అడవి ఏనుగు ను బంధించాలని నెలరోజులనుంచి అటవీశాఖ అధికారులను కోరినా చర్యలు తీసుకోలేదని ఘటనాస్థలం వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు.

సీఎం సమావేశం
ఈ ప్రమాదం నేపథ్యంలో మూడిగెరెలో జిల్లాధికారి, జిల్లా ఎస్పీ, అటవీ శాఖాధికారులతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం నిర్వహించారు. నగరాల్లోకి వస్తున్న ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరమాలన్నారు. మీనా బంధువులతో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ.15 లక్షల చెక్‌ను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు.

 

మరిన్ని వార్తలు