ఢిల్లీలో జగన్ అరెస్ట్

11 Aug, 2015 02:06 IST|Sakshi
ఢిల్లీలో జగన్ అరెస్ట్

- ఉద్రిక్తత నడుమ పార్లమెంట్‌కు మార్చ్‌ఫాస్ట్
- పోలీసుల దురుసుతనం, కార్యకర్తలతో వాగ్వాదం
- వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్, పార్టీ నేతలు అరెస్టు, విడుదల
 
సాక్షి, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఐదు కోట్ల ఆంధ్రుల తరపున దేశ రాజధాని ఢిల్లీలో నిరసన గళం వినిపించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 3.30 వరకు జగన్ ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలతో ధర్నా జరిగింది.

మన పోరాటం ఇంతటితో ఆగదు.. ఇక్కడ(ధర్నాస్థలి) నుంచి పార్లమెంట్‌కు వరకు మార్చ్ చేద్దాం(నడుద్దాం)... అని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చి జగన్ ధర్నాను ముగించారు. ఆ తర్వాత వేదిక దిగి పార్లమెంట్ వైపు కదలడానికి సమాయత్తమవుతున్న జగన్, పార్టీ నేతలను పోలీసులు అడ్డగించారు. పార్లమెంట్ వైపు వెళ్లడానికి అనుమతి లేదని, ఆ ఆలోచన విరమించుకోవాలని జగన్‌కు విజ్ఞప్తి చేసినా.. అందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి తాము శాంతియుతంగా వెళతామని, అనుమతించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఈ దశలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పార్టీ నేతలు, కార్యకర్తలను జగన్ నుంచి దూరంగా నెట్టేశారు. ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలను పోలీసులు గట్టిగా పట్టుకొని పక్కకు విసిరేశారు. పోలీసుల చర్య ను కార్యకర్తలు గట్టిగా అడ్డుకున్నారు. పోలీ సుల అత్యుత్సాహం ఫలితంగా పార్టీ రైతు విభాగం కడప జిల్లా నేత ప్రసాదరెడ్డి.. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో.. 10 నిమిషాల వ్యవధిలో దాదాపు వందమందికిపైగా పోలీసులు అదనంగా వచ్చారు.

పోలీసుల అభ్యంతరం, ఉద్రిక్తత మధ్య జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి 100 మీటర్లు ముందుకు నడిచారు. ఐటీబీపీ సాయుధ పోలీసులు, ఢిల్లీ పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో అడ్డగించి ప్రదర్శన ముందుకు సాగకుండా అడ్డుకోవడంతో.. ఆగ్రహించిన జగన్ అక్కడే బైఠాయించారు. నాయకులు, కార్యకర్తలు ఆయనతో పాటు రోడ్డు మీద కూర్చొని.. మాకు న్యాయం కావాలి (వియ్ వాంట్ జస్టిస్) అంటూ నినాదాలు చేశారు. జగన్‌కు సమీపంలోకి పోలీసులు రాకుండా 15 నిమిషాలకుపైగా కార్యకర్తలు రక్షణగా నిలిచారు. పోలీసులు లాఠీలు ఝళిపించి.. కార్యకర్తలను చెల్లాచెదరు చేశా రు.

అదే అదునుగా.. జగన్‌తో ఎంపీలు వై.వి. సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి, పార్టీ నేతలు విజ యసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులను వాహనంలోకి ఎక్కించారు. కార్యకర్తలు మళ్లీ ‘జై జగన్’ నినాదాలతో వాహనం ముందుకు కదలకుండా నిలువరించారు. పోలీ సులు కార్యకర్తలను పక్కకునెట్టి వాహనాన్ని ముందుకు కదిలించారు. మెరుపువేగంతో వాహనాన్ని ముందుకు కదిలించి పార్లమెంట్ వీధి పోలీస్ స్టేషన్‌కు చేర్చారు.

సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు జగన్‌తో పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పి.వి. మిథున్‌రెడ్డి, వరప్రసాదరావు, పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కరుణాకరరెడ్డి, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. తర్వాత పోలీసులు నాయకులందరినీ విడిచిపెట్టారు.
 
ప్రజాస్వామ్యం తలదించుకోవాలి: జగన్
అరెస్టుకు కొద్ది నిమిషాల ముందు జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరు అప్రజాస్వామికమని విమర్శించారు. శాంతియుతంగా తాము పార్లమెంట్‌కు వెళుతుంటే అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా పార్లమెంట్‌కు వెళతామంటే ఎందుకు అనుమతించరని పోలీసులను నిలదీశారు. ‘‘పార్టీ కార్యకర్తలు, నేతలు, ఢిల్లీలో ఉన్న రాష్ట్రానికి చెందిన సానుభూతిపరులు కలిసి ధర్నా చేసి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి నడిచి వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు.

మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి పార్లమెం ట్‌కు వెళుతుంటే.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పోలీసులు వద్దంటున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ప్రజాస్వామ్యం తలదించుకోవాలి. అరెస్టు చేయొద్దు, మాకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోనివ్వండి అని అడుగుతుంటే.. అరెస్టు తప్పదని పోలీసులు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం? మా రాష్ట్ర దుఃఖాన్ని వినిపించుకోవడానికి కూడా మాకు హక్కు లేదా?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్ల మరింత మంది అమాయకులు ఇబ్బంది పడకూడదు, కార్యకర్తలు గాయపడకూడదనే ఉద్దేశంతో తాను అరెస్టయ్యాయని జగన్ స్పష్టం చేశారు.
 
పోలవరం నిర్వాసితుల మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు పోలవరం డ్యామ్ నిర్వాసితులు మద్దతు తెలిపారు. సామాజిక, రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పోలవరం నిర్వాసితులు, గిరిజనులు సోమవారం జంతర్ మంతర్‌లోని ధర్నా వేదిక వద్దకు చేరుకుని పోరాటానికి సంఘీభావం తెలిపారు.

మరిన్ని వార్తలు