పెళ్లికి ఒప్పుకోలేదని..

24 Jun, 2018 12:58 IST|Sakshi
నిందితుడు అన్బయగన్‌(ఫైల్‌) 

యువతి, తల్లిదండ్రులపై యువకుడి దాడి

సంఘటన స్థలంలోనే యువతి, తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం.. 

అనంతరం ఆత్మహత్య చేసుకున్న యువకుడు

పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు యువ తి కుంటుంబ సభ్యులపై దారుణానికి ఒడిగట్టాడు. యువతి, తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çసంఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. 


సాక్షి, తిరువణ్ణామలై : పెళ్లికి అంగీకరించలేదని యువతి, తల్లిదండ్రులపై దాడిచేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో యువతి, తల్లి మృతిచెందగా, యువతి తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కణ్ణమంగళం సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని కనికాపురానికి చెందిన శివరామన్‌(54) వ్యవసాయ కూలీ. ఇతని భార్య చామండీశ్వరి(44), వీరి కుమార్తె నిర్మల(24) ఎంఏ, బీఎడ్‌ పట్టభద్రురాలు.

ఇదే గ్రామానికి చెందిన రాజవేలు కుమారుడు అన్బయగన్‌(34) వీరికి బంధువు అవుతాడు. ఇతను నిర్మలను వివాహం చేసుకోవాలని ఆశతో ఉన్నాడు. నిర్మల చదువుకు అయ్యే ఖర్చులు పూర్తిగా అన్బయగన్‌ పెట్టినట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం శివరామన్‌ ఇంటికి వెళ్లి నిర్మలను వివాహం చేసుకుంటానని అన్బయగన్‌ కోరాడు. ఇందుకు చామండీశ్వరి నిరాకరించడం, నిర్మల కూడా వివాహం చేసుకోనని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన అన్బయగన్‌ ఇంట్లో ఉన్న కత్తితో చామండీశ్వరి, శివరామన్, నిర్మలను పొడిచాడు. నిర్మల, చామండీశ్వరి అక్కడిక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలతో శివరామన్‌ కేకలు వేశాడు.

దీంతో అన్బయగన్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ కేకలు విన్న స్థానికులు ఇంటికి వచ్చి శివరామన్‌ను ఆస్పత్రికి తరలించారు. శివరామన్‌ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అనంతరం అన్బయగన్‌ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని, డీఎస్పీ సెంథిల్, కణ్ణమంగళం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు