‘108’ సమ్మె ఒక రోజు వాయిదా

8 May, 2015 01:30 IST|Sakshi
‘108’ సమ్మె ఒక రోజు వాయిదా

హైదరాబాద్: ‘108’ ఉద్యోగులు తమ సమ్మెను ఒక రోజు వాయిదా వేసుకున్నారు. కార్మికశాఖ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చర్చలకు ఆహ్వానించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లి అశోక్ చెప్పారు. తమ సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం సూచన మేరకు తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు.  చర్చల్లో కార్మికశాఖ అధికారులు, జీవీకే, 108 ఉద్యోగ ప్రతినిధులు పాల్గొంటారు. మరోవైపు జీవీకే యాజమాన్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాష్ గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై తీసుకుంటున్న చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

108 అంబులెన్స్ వాహనాలను నడిపేందుకు డ్రైవర్లను, సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసినట్లు జీవీకే పేర్కొందన్నారు.  వేతనాలు పెంచే అవకాశాలను పరిశీలించాలని తాము యాజమాన్యాన్ని కోరినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. వేతనాలు పెంచాలంటే ప్రభుత్వం ‘108’ వాహనాల నిర్వహణ ఖర్చులను పెంచాల్సి ఉం టుందన్న చర్చ జరుగుతోంది.  ఒక్కో వాహనానికి నెలకు రూ. 1.30 లక్షల చొప్పున జీవీకేకు ప్రభుత్వం అందజేస్తుంది. అందులో రూ. 77 వేలు ఉద్యోగుల వేతనాలకే వెళ్తున్నాయి. నిర్వహణ సొమ్మును పెంచాలని జీవీకే ప్రతిపాదిస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లేవాళ్లమని ఒక అధికారి పేర్కొన్నారు.
 
 తీసేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోబోం
 
 
 గతంలో వివిధ  రకాల కేసుల్లో తీసేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను తాము అంగీకరించబోమని జీవీకే-ఈఎంఆర్‌ఐ ఆపరేషన్స్ రాష్ట్ర అధిపతి పి.బ్రహ్మానందరావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2011లో చేసుకున్న ఒప్పందం ప్రకారం వేతనాలను 10 శాతం అమలు చేస్తున్నామన్నారు. సమ్మె నోటీసులో పేర్కొన్న డిమాండ్లలో రెండింటిని మినహాయించి మిగిలినవాటిపై యాజమాన్యం సానుకూలంగా ఉందన్నారు. కార్మికశాఖ నిర్వహించే చర్చలు సఫలం కాకుంటే ‘108’ సర్వీసులను నడిపించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు