కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం 

21 Sep, 2023 01:35 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె..

డిమాండ్లు పరిష్కరించాలంటూ బైఠాయింపు పలుచోట్ల లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం..

పోలీసుల అడ్డగింత, అరెస్టులతో ఉద్రిక్తత

సాక్షి, హైదరాబాద్‌/ కైలాస్‌నగర్‌ (ఆదిలాబాద్‌)/జగిత్యాల క్రైం/సుభాష్ నగర్‌ (నిజామాబాద్‌): అంగన్‌వాడీల్లోని టీచర్లు, హెల్పర్లు తలపెట్టిన సమ్మె పదోరోజూ ఉధృతంగా కొనసాగింది. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. టీచర్లు, హెల్పర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు.

ఈనెల 11వ తేదీ నుంచి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్‌వాడీ టీచర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు పెన్షన్, ఆరోగ్య పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. బుధవారం టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి.  

ఆదిలాబాద్‌లో జుట్లు పట్టుకుని.. 
ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో పలువురు అంగన్‌వాడీలు, పోలీసులకు గాయాలయ్యాయి. అంగన్‌వాడీలను నిలువరించే క్రమంలో తలమడుగు ఎస్సై ధనశ్రీ ఓ అంగన్‌వాడీ జుట్టు పట్టుకుని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు అంగన్‌వాడీలు ఎస్సై ధనశ్రీని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు.

సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు పలువురిని పోలీసులు అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంతమంది అంగన్‌వాడీలు స్టేషన్‌కు చేరుకుని బైఠాయించడంతో కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. వారంతా తిరిగి కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని నిరసన కొనసాగించడంతో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా సమ్మె శిబిరానికి చేరుకున్న తర్వాత బేల మండలం సదల్‌పూర్‌ అంగన్‌వాడీ టీచర్‌ ప్రగతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. 

జగిత్యాలలో పోలీసులపై దాడి 
జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ వద్ద ముట్టడి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్‌వాడీలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో అంగన్‌వాడీలు బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు పలువురు అంగన్‌ వాడీలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రావు తదితరులు అంగన్‌వాడీల ఆందో ళనకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌కు కూడా అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారితో పాటు సీఐటీయూ నాయకులు గేట్లు ఎక్కి లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. 

మరిన్ని వార్తలు