163 పాడిగేదెలకు పునర్జీవనం

5 May, 2018 11:56 IST|Sakshi
మరిమడ్లలో మృత్యువాత పడిన గేదెలు(ఫైల్‌)

ఎర్రజొన్న మేసి.. కళ్లు తేలేసి.. 15 బర్రెల మృత్యువాత..

మరిమడ్లలో రైతు ఇంట కన్నీరు..

ఫలించిన పశువైద్యుల శ్రమ

ఘటనపై జేసీ పర్యవేక్షణ

సిరిసిల్ల :  అదో మారుమూల పల్లె. జిల్లా సరిహద్దులోని అటవీ గ్రామం. వ్యవసాయ ఆధారమైన ఆ పల్లెకు పాడి పరిశ్రమ ఓ ఉపాధిమార్గం. వ్యవసాయ అనుబంధంగా పాలతో ఆ పల్లె ప్రజలు జీవనం సాగిస్తారు. అలాంటి ఊరిలో 178 బర్రెలు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి.. 15 బర్రెలు మరణించాయి. కళ్ల ముందే గేదెలు చనిపోతుండడంతో రైతుల గుండెలు అవిసిపోయాయి. కన్నీరు మున్నీరుగా విలపించారు. మహిళా రైతులు గుండెలు బాదుకుంటూ.. రోధిస్తున్నారు.

ఆ గ్రామస్తులు సెల్‌ఫోన్‌లో బర్రెల ఫొటోలు కలెక్టర్‌ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, పశువైద్యులకు పంపించారు. అంతే జిల్లా నలుమూలన ఉన్న పశువుల డాక్టర్లు మరిమడ్ల బాట పట్టారు. ఉన్న పళంగా అందుబాటులో ఉన్న మందులను, ప్రైవేటుగా అత్యవసరమైన మందులను కొనుగోలు చేసి మూడు అంబులెన్స్‌లు మరిమడ్ల చేరాయి. ఐదుగంటల పాటు శ్రమించారు. 163 బర్రెలను బతింకించారు. వంద మంది రైతులకు దీర్ఘకాలిక మేలు చేశారు. పాడికి ప్రాణం పోశారు.

ఏం జరిగిందంటే..

మరిమడ్లలో గేదెలను ఒకరిద్దరు కాపరులు కాస్తుంటారు. బర్రెలన్నీ ఎప్పటిలాగే సమీప అడవుల్లోకి మేతకు వెళ్లాయి. పక్కనే లూటీ అయిన పొలాలున్నాయి. ఎర్రజొన్న పంటను కోశారు. పక్షంరోజుల కిందట కురిసిన అకాల వర్షాలకు జొన్న కొయ్యలు(మోడులు) చిగురించాయి. చిగురించిన లేత జొన్న ఆకులను బర్రెలు మేశాయి. ఎక్కువగా లేత ఆకులు తినడంతో నాము వచ్చింది. దీంతో బర్రెలన్నీ సొమ్మ సిల్లాయి. అందులో 13 మరణించాయి.

వెంటనే గ్రామస్తులు స్పందించి జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో పశువైద్యులు చేరుకుని వైద్యం చేశారు. చికిత్స పొందుతుండగానే మరో రెండు బర్రెలు మరణించాయి. ఎనిమిది కొన ఊపిరితో ఉండగా.. సెలైన్లు ఎక్కించి బతికించారు. 

జేసీ పర్యవేక్షణలో వైద్య సేవలు..

జాయింట్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా పర్యవేక్షణలో మరిమడ్లలో పశువైద్య శిబిరం సాగింది. యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది కదిలివెళ్లారు. ఐదురుగు డాక్టర్లు అంజిరెడ్డి, ప్రశాంత్, కార్తీక, సాయిమాధవి, చందన, 14 మంది పారామెడికల్‌ సిబ్బంది, 1962 అంబులెన్స్‌ సిబ్బంది, మరోవైపు  కరీంనగర్‌ డెయిరీ డాక్టర్లు, సిబ్బంది, మందులతో అక్కడికి చేరుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై జేసీ యాస్మిన్‌బాషా సిరిసిల్ల నుంచి ఫోన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు.

మొత్తంగా జిల్లా పశువైద్యుల సమష్టి కృషితో 163 బర్రెలకు ఊపిరి పోశారు. పశువైద్యుల సేవలను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు శుక్రవారం అభినందించారు. వైద్యులు సకాలంలో రాకుంటే మరిన్ని చనిపోయేవని గ్రామస్తులు ఎమ్మెల్యేకు చెప్పడం కొసమెరుపు.

అందరూ టీం వర్క్‌ చేశారు

మా డాక్టర్లు అందరూ మరిమడ్లలో టీం వర్క్‌ చేశారు. ఎవరికి వారు బర్రెలను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. లేత జొన్న ఎక్కువగా మేయడంతో గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. రైతులు ఇంకా ముందుగా గుర్తిస్తే నష్టం జరిగేది కాదు. మేమంతా బాధ్యతగా ఎవరికి వారు పని చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది.  – డాక్టర్‌ కె .కొమురయ్య, అసిస్టెంట్‌ డైరెక్టర్‌  

మరిన్ని వార్తలు