మరో 164 కరోనా కేసులు

13 Jun, 2020 02:42 IST|Sakshi

కరోనా సోకి శుక్రవారం 9 మంది మృతి

జీహెచ్‌ఎంసీ పరిధిలో 133 కేసులు నమోదు

రాష్ట్రంలో మొత్తం 4,484కు చేరిన కేసుల సంఖ్య

ఇప్పటివరకు 2,278 మంది డిశ్చార్జి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తాజాగా మరో 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 4,484 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 2,278 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 2,032 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా సోకడంతో మరో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 174కు చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 133 నమోదయ్యాయి. అలాగే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ఆరు చొప్పున, సంగారెడ్డి జిల్లాలో 4, నిజామాబాద్‌ జిల్లాలో 3, మహబూబ్‌నగర్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో 2 చొప్పున, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

పేట్లబురుజు ఆస్పత్రిలో 8 మందికి.. 
దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 8 మందికి కరోనా సోకింది. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్, ఓ మహిళా సెక్యూరిటీ గార్డు, మరో ఆరుగురు శానిటేషన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ను హోం క్వారంటైన్‌కు తరలించగా.. మిగతా వారిని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ బెడ్లు లేకపోవడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా
హైదరాబాద్‌లోని ఓ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తీవ్రమైన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతూ పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 10న కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కొండాపూర్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

బంజారాహిల్స్‌ ఠాణాలో మరో ఐదుగురికి.. 
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 10 మంది సిబ్బంది కరోనా బారినపడి హోం క్వారంటైన్‌లో ఉండగా, తాజాగా ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు హోంగార్డులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటివరకు మొత్తం 15 మంది సిబ్బందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు