జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలు

8 Apr, 2017 01:54 IST|Sakshi
జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలు

500 మంది వైద్య సిబ్బంది భర్తీకి ఆదేశం
కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా ఎంపిక కమిటీ ఏర్పాటు
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు


సాక్షి, హైదరాబాద్‌: జిల్లా ఆసుపత్రులు, గుర్తిం చిన ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో ఐసీయూ 10 పడకలతో ఏర్పాటు చేస్తారు. ఇటీవలే మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్ధిపేట జిల్లా ఆసుపత్రుల్లో ప్రారంభం కాగా, మరో 17 ఐసీయూలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లా ఆసుపత్రుల్లో ఐసీ యూలు ఏర్పాటు చేస్తారు. అలాగే నాగర్‌ కర్నూలు, నారాయణ్‌పేట్, మెదక్, జహీరా బాద్, మంచిర్యాల,నిర్మల్,కామారెడ్డి, సిరిసిల్ల, మహబూబాబాద్, భద్రాచలం, సూర్యాపేట, గద్వాల్‌ ఏరియా ఆసుపత్రుల్లో నెలకొల్పు తా రు. ఏటూరు నాగారం, ఉట్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తారు.

కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకం
కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐసీయూలకు 500 మంది వైద్య సిబ్బందిని నియమిస్తారు. వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో, నర్సులు, సాంకేతిక సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు. కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా ఎంపిక కమిటీ వీరిని భర్తీ చేస్తుంది. ఒక్కోఐసీయూకు అధిపతిగా అనెస్థీషియా స్పెషలిస్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ను నియమిస్తారు. అతనికి నెల వేతనం రూ.లక్ష నిర్థారించారు. అలాగే ఐసీ యూకు జనరల్‌ మెడిసిన్‌ స్పెషలిస్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను ఇద్దరిని నియమిస్తారు. వారి వేతనం రూ.80వేలు. పల్మనరీ స్పెషలిస్ట్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను ఇద్దరిని నియమి స్తారు. వారికీ జీతం రూ.80వేలు.

అవసరాన్ని బట్టి కార్డియాలజీ స్పెషలిస్టును ప్రత్యేకంగా కన్సల్టేషన్‌ ఫీజుతో బయటి నుంచి రప్పిస్తారు. ఒక్కో ఐసీయూకు ఆరుగురు స్టాఫ్‌ నర్సులను, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్‌ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, వెంటిలేటర్‌ టెక్నీషి యన్‌లను నియమిస్తారు. అలాగే 8 మంది ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వోలను నియమిస్తారు. ఒక్కో ఐసీయూకు ముగ్గురు సెక్యూరిటీ గార్డుల ను నియమిస్తారు. వారిలో స్టాఫ్‌ నర్సు వేతనం రూ.20 వేలు, ల్యాబ్‌ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, వెంటిలేటర్‌ టెక్నీషియన్లకు రూ.15వేల వేతనం ఇస్తారు. ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వోలకు రూ.12వేలు, సెక్యూరిటీ గార్డు లకు రూ.9వేల చొప్పున వేతనం ఇస్తారు.

వైద్య సిబ్బందికి అర్హతలివే...
ఐసీయూ అధిపతిగా తీసుకోబోయే అనెస్థీషియా స్పెషలిస్టు ఎండీ (అనెస్థీషియా) చదివి ఉండాలి. జనరల్‌ మెడిసిన్‌ స్పెషలిస్టు ఆ విభాగంలో ఎండీ చేసి ఉండాలి. పల్మనరీ మెడిసిన్‌ స్పెషలిస్టు డీఎం పల్మనరీ లేదా ఎండీ (ఛాతీ వ్యాధులు) చేసి ఉండాలి. ఇక స్టాఫ్‌ నర్సులు బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎంలో డిప్లొమా చదివి ఉండాలి. మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నీషియన్‌ కోర్సు చదివిన అభ్యర్థులను ల్యాబ్‌ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. రేడియోగ్రాఫర్‌గా డిప్లొమా చేసిన అభ్యర్థులను రేడియాలజీ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. ఇంటర్‌తోపాటు వెంటిలేటర్‌ డిప్లొమా చేసిన అభ్యర్థులను వెంటిలేటర్‌ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. పదో తరగతి పాసై ప్రాథమిక చికిత్సలో సర్టిఫికెట్‌ ఉన్న వారిని ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వోలుగా తీసుకుంటారు. పదో తరగతి పాసైన వారిని సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్‌ తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

మరిన్ని వార్తలు