ఎవరు బాధ్యులు?

8 Apr, 2017 01:52 IST|Sakshi
ఎవరు బాధ్యులు?

గందరగోళంలో పోలీసు నియామకాలు
- ఫలితాల్లో ఎన్నో సందేహాలు, అభ్యంతరాలు
- రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారుల బదిలీతో జవాబు చెప్పేవారు కరువు
- నిన్న కానిస్టేబుల్, నేడు ఎస్సై అభ్యర్థుల ఆందోళన
- నెల గడిచిపోతున్నా ఓపెన్‌ చాలెంజ్‌పై ముందుకు సాగని ప్రక్రియ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీ స్థాయిలో నియామకాలు చేపట్టిన పోలీస్‌ శాఖ.. ఆయా ఉద్యోగ పరీక్షల ఫలితాల వెల్లడి, సందేహాల నివృత్తిలో పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. పది రోజుల కిందటి వరకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వ్యవహా రాలు పర్యవేక్షించిన అదనపు డీజీపీ పూర్ణచం దర్‌రావు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ అయ్యారు. అయితే ఆయనకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు బాధ్యతలను అదనంగా అప్పగించారు. కానీ ఏసీబీలోనే పని ఒత్తిడి ఉండటంతో ఆయన రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదు. దాంతో కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో పొరపాట్లు, అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలపై ఏ అధికారి సమాధానం చెప్పడం లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదిన్నరగా ఏం చేశారు?
పోలీసు శాఖలో 60 ఏళ్ల నుంచి మూస పద్ధతిలో జరుగుతున్న నియామక విధానాన్ని ప్రక్షాళన చేసినా.. కొత్త నియామకాల ఫలితాలు వెల్లడిలో పోలీసుశాఖ విఫలమైందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన్‌ విడుదల, నియామక ప్రక్రియ, ఫలితాల వెల్లడి.. ఈ ప్రక్రియలకు దాదాపు ఏడాదిన్నర పట్టింది. అయినా సమగ్ర కార్యాచరణ పాటించడంలో గానీ, అమలుచేయడంలో గానీ అధికారులు విఫలమయ్యారని పోలీసు శాఖ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.

చాలా అంశాల్లో స్పష్టత కరువు
కానిస్టేబుల్, ఎస్సై తత్సమాన హోదాల పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించిన పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చేసింది. ముందుగా ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సరైన రీతిలో రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేయలేదని, ఓపెన్‌ కేటగిరీలో మార్కులు ఎక్కువ వచ్చినా ఉద్యోగం రాకపోవడం, ఎన్‌సీసీ కటాఫ్‌ జనరల్‌ అభ్యర్థుల కటాఫ్‌ కంటే ఎక్కువగా ఉండటం, హోంగార్డుల్లో కనీస మార్కులు సాధించని వారిని రిజర్వేషన్ల పేరిట ఎంపిక చేయడంపై 153 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు.

అయితే హైకోర్టులో కేసు పూర్తి కాకుండానే రిక్రూట్‌మెంట్‌ బోర్డు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడం ఆశావహులైన అభ్యర్థుల్లో ఆగ్రహం రగిల్చింది. దాంతో గురువారం 50 మంది అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక ఎస్సై పోస్టుల ఫలితాలను ఇప్పటికీ ప్రకటించకపోవడం మరో ఆందోళనకు తెరతీసింది. శుక్రవారం దాదాపు 40 మంది అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. లాంగ్వేజ్‌ పేపర్లలో ఇంగ్లిష్‌కు వెయిటేజీ ఇస్తామని ఒకసారి, లేదని మరోసారి రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించిందని వాపోయారు.

అలవిమాలిన నిర్లక్ష్యం!
కానిస్టేబుల్‌ అభ్యర్థుల సందేహాలు, అభ్యంతరాలపై రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. ఇదేమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తే.. హైకోర్టులో కేసు ఉందని, సమయం పడుతుందని పేర్కొంది. తాజాగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు బాధ్యులైన అధికారి బదిలీపై వెళ్లిపోగా.. సమాధానం చెప్పేవారు కరువయ్యారు. వాస్తవానికి అభ్యర్థుల సందే హాలను గత నెల 15వ తేదీనే నివృత్తి చేస్తామ న్నారు. ఆ గడువు దాటి మరో 20 రోజులైనా సమాధానం లేదు.

అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ముట్టడికి వస్తే.. బోర్డుకు, డీజీపీ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేని అధికారులు నచ్చజెప్పి పంపించారు. పదిహే ను రోజుల్లో బోర్డు అధికారులు సందేహాలను నివృత్తి చేస్తారని డీజీపీ కార్యాలయం అడ్మిన్‌ ఐజీ కల్పనానాయక్‌ చెప్పారు. శుక్రవారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అభ్యర్థుల విషయంలోనూ కల్పనానాయక్‌ సమాధానమిచ్చారు. కానీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తరఫున ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పడానికి రాకపోవడం నిర్లక్ష్యమేనని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ అవే సమస్యలు..
కానిస్టేబుల్‌ ఫలితాల వెల్లడిలో ఎదురైన సమస్యలే ఎస్సై పోస్టుల ఫలితా ల్లోనూ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రెండింటికీ ఒకేరకమైన రిజర్వేషన్ల ప్రక్రియ, ఒకే రకమైన కటాఫ్, నియామక విధానాలు ఉన్నాయి. పైగా కానిస్టేబుల్‌ ఫలితాల విషయంలో హైకోర్టు లో రిక్రూట్‌మెంట్‌ బోర్డు అఫిడవిట్‌ దాఖలు చేసింది. కటాఫ్, రిజర్వేషన్లు తదితర అంశా లను సమీక్షించుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సై పోస్టుల విషయంగా ఎలా వ్యవహరిస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. అసలు దాదాపు ఐదు నెలల కింద మెయిన్‌ పరీక్ష జరిగితే.. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించకపోవడంపై కూడా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు