ఆర్టీసీని కాపాడుదాం

2 Oct, 2019 03:16 IST|Sakshi
ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులతో కలసి బయటకు వస్తున్న సీఎం కేసీఆర్‌

సమస్యలపై చర్చించేందుకు ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీ

రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం నివేదిక ఆధారంగా చర్యలు 

కార్మికులతో నేడు చర్చించనున్న కమిటీ

ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చించి, వారి డిమాండ్లు తెలుసుకునేందుకు ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ఓ కమిటీని నియమించింది. ఆర్టీసీ కార్మికులతో బుధవారం ఈ బృందం సమావేశమై చర్చించాలని, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, అందుకు అనుగుణంగా ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా కేబినెట్‌ భేటీ జరిగింది.

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కేబినెట్‌ సమావేశం రాత్రి 11:20 గంటలకు ముగిసింది. ఏకబిగిన ఏడున్నర గంటలపాటు ఈ భేటీ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిస్థితులతో పాటు రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ చర్చించింది. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సోమేశ్‌ కుమార్, రామకృష్ణారావు, సునీల్‌శర్మలతో కమిటీని నియమించింది. కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో వారి డిమాండ్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది.

ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలో సమ్మెకు పోయి సంస్థను నష్టపరచొద్దని సూచించింది. ప్రజలంతా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ఈ సందర్భంలో సమ్మెకు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొవద్దని కార్మికులను కోరింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతోఉందని కేబినెట్‌ స్పష్టం చేసింది.

ఉప సంఘాల ఏర్పాటు..
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు శాశ్వత ప్రాతిపది కన మంత్రివర్గ ఉపసంఘాలను నియమించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ ఉప సంఘాలు ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, ప్రభుత్వానికి సూచనలు చేయనున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల పకడ్బందీ అమలు, పర్యవేక్షణ కోసం వివిధ శాఖలకు సంబంధించి 8 ఉప సంఘాలు ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖల మంత్రులు చైర్మన్లుగా ఉండే ఈ కమిటీల్లో కొందరు సభ్యులను నియమించింది.

వ్యవసాయ రంగంపై చర్చ
రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయరంగ పరిస్థితిని కేబినెట్‌ సమావేశం విస్తృతంగా చర్చించింది. వర్షా కాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సన్నద్ధం కావాలని కోరింది. వేసవి కాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సమీకరించుకోవాలని, ఇందుకు అవసరమైన విధానం రూపొందించుకోవాలని అధికారులకు సూచించింది.

10న మంత్రులు, కలెక్టర్ల సమావేశం..
గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై చర్చించేందుకు ఈ నెల 10న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం జరిగింది. ఈ సమావేశానికి డీపీవోలు, డీఎల్పీవోలను కూడా ఆహ్వానించారు. సమావేశంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యాన్ని పెంపొందించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానం, పౌల్ట్రీ పాలసీ రూపొందించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు