రిమ్‌జిమ్‌.. రిమ్‌జిమ్‌.. హైదరాబాద్‌

26 Nov, 2017 02:09 IST|Sakshi

షాన్‌ హైదరాబాద్‌.. టూర్‌ ప్యాకేజీలు 

నగరంలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు

సన్నద్ధమవుతున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ

తారామతి బారాదరిలో తెలంగాణ సాంస్కృతిక ఆవిష్కరణ

సదస్సుకు వచ్చే డెలిగేట్లకు విమానాశ్రయంలో బొట్టుపెట్టి స్వాగతం

జీఈఎస్‌ సదస్సు ప్రాంగణంలో 300 మంది మహిళా వలంటీర్లు  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు వచ్చే దేశవిదేశాల ప్రతినిధులకు హైదరాబాద్‌ అందాలను, చారిత్రక, పర్యాటక స్థలాలను చూపించేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారి మనసు దోచుకొనేలా పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. నగరంతోపాటు తెలంగాణ పల్లె అందాలు, సంస్కృతిని చూపే ఏర్పాట్లు చేసింది. డెలిగేట్లకు ఆతిథ్యమివ్వడంలో, మర్యాదల్లో ఏ లోపానికి తావులేకుండా ఉండేలా హోటల్‌ మేనేజ్‌మెంట్, ఆతిథ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. 

ఆధ్యాత్మిక పర్యటన 
నగరంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే ఈ పర్యటనలో బిర్లామందిర్, జగన్నాథస్వామి టెంపుల్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చి తదితర ప్రాంతాలు ఉంటాయి. ప్లాజా హోటల్‌లో భోజన వసతి ఉంటుంది. ఈ టూర్‌ చార్జీ రూ.6,000. అమెరికా కరెన్సీలో సుమారు 95 డాలర్లు. ఈ పర్యటన ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. 

విలేజ్‌ టూర్‌.. 
ఈ టూర్‌లో భాగంగా నగరానికి సమీపంలోని వికారాబాద్‌లో వ్యవసాయ క్షేత్రాలు, సాంప్రదాయ జీవన విధానాన్ని, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. గ్రామాల్లో విదేశీ టూరిస్టులను ఎడ్ల బండ్లపై తిప్పుతారు. చక్కటి పల్లె పర్యటన అనుభూతి కలిగిస్తారు. రుసుము రూ.6,000 (95 డాలర్లు). 

మైక్రో బ్రేవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
విదేశీ పర్యాటకులను ఆకట్టుకొనే మరో ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమం ఇది. ఆలివ్‌ బిస్ట్రోలో మైక్రో బ్రేవింగ్‌ రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మైక్రోబ్రేవింగ్‌ సందర్శనతో పాటు ఇటాలియన్‌ డిన్నర్, లైవ్‌ మ్యూజిక్‌ ఉంటాయి. రుసుము రూ.6,000 (95 డాలర్లు). 

క్రాఫ్ట్‌ అండ్‌ కల్చరల్‌ టూర్‌
తారామతి బారాదరిలో పతంగుల ఉత్సవం, సాంస్కృతిక ప్రదర్శన, భారతీయ వంటకాల తయారీ, ఇక్కత్‌ చేనేత వస్త్రాలు, హస్తకళలు వంటివి ఉంటాయి. ఈ సందర్శనకు రూ.12,000 రుసుము (125 డాలర్లు). భోజనం, రవాణా తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వీటితోపాటు గోల్ఫ్‌ టూర్, సైక్లింగ్‌ టూర్, రామోజీ ఫిల్మ్‌సిటీ, గోల్కొండ కోటలో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో టూర్‌లు కూడా ఉన్నాయి. స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ, గోల్కొండ ఎంపోరియం తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. 

బొట్టుపెట్టి ఆహ్వానం.. తోడుగా గైడ్‌లు 
పలుదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను సాదరంగా నగరానికి ఆహ్వానించేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ బృందం ఈ నెల 27నుంచే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంటుంది. విమానాశ్రయానికి చేరుకునే ప్రతినిధులందరికీ సాదర స్వాగతం పలుకుతూ నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. అనంతరం వారిని ఇమ్మిగ్రేషన్‌ కేంద్రానికి తీసుకెళ్తారు. విమానాశ్రయం నుంచి ఆర్టీసీ, పర్యాటక శాఖ బస్సుల్లో ప్రతినిధులు బస చేసే హోటళ్లకు తీసుకెళతారు. ప్రతి బస్సులో ఇద్దరు గైడ్స్‌ ఉంటారు. అలాగే నగరానికి రానున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు బస చేయనున్న 20 హోటళ్లలోనూ శిక్షణ పొందిన గైడ్స్‌ ఉంటారు. హోటళ్ల నుంచి హెచ్‌ఐసీసీకి, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వారు తమ సేవలు అందజేస్తారు. 28 నుంచి 30 వరకు సదస్సు జరుగనున్న హెచ్‌ఐసీసీతో పాటు ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట, చార్మినార్, లాడ్‌ బజార్‌ తదితర ప్రాంతాల్లోనూ పర్యాటకాభివృద్ధి సంస్థ గైడ్‌లు  ఉంటారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి శిక్షణ పొందిన వారిని కూడా నగరానికి రప్పించారు. 


కులీకుతుబ్‌షా టూంబ్స్‌ సందర్శన 
హైదరాబాద్‌ చారిత్రక, వారసత్వ కట్టడాల పర్యటనలో భాగంగా రూపొందించిన ‘హైదరాబాద్‌ హెరిటేజ్‌ టూర్‌’లో కులీకుతుబ్‌షా టూంబ్స్, గోల్కొండ కోట, తారామతి బారాదరి సాంస్కృతిక వేదిక ఉంటాయి. భోజన సదుపాయంతో కూడిన ఈ టూర్‌లో తారామతి బారాదరి వద్ద తోలుబొమ్మలాట వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, ముత్యాలు, గాజుల ప్రదర్శన, చేనేత వస్త్రాల తయారీ వంటి ప్రదర్శనలు ఉంటాయి. ఈ పర్యటన రుసుము రూ.5,000. అమెరికా కరెన్సీలో 80 డాలర్లు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ టూర్‌ ఉంటుంది. 

పోచంపల్లి చీరలతో వలంటీర్లు 
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో.. సదస్సు జరుగనున్న హెచ్‌ఐసీసీ వద్ద 300 మంది యువతులు పోచంపల్లి చీరలను ధరించి వలంటీర్లుగా విధులు నిర్వహించనున్నారు. ప్రతినిధులకు కావాల్సిన సదుపాయాలను.. సలహాలు, సూచనలను అందజేస్తారు. వేదిక వద్ద అందుబాటులో ఉండి అవసరమైన సహాయం చేస్తారు.  

>
మరిన్ని వార్తలు