3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం

24 Sep, 2018 01:22 IST|Sakshi

కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 34.08 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరాన్ని వైద్యులు నిర్ధారించారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా 2.42 లక్షల మందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందన్నారు. 16,265 మందికి కరోనా, 68,788 మందికి ఇతరత్రా కంటి శస్త్రచికిత్సలు చేయాలని నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా 41 వేల మందికి ఆపరేషన్లు చేయాలని గుర్తించారు.  

అంచనాలను మించి..:  కంటి వెలుగుకింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్యశాఖ మొదట్లో అంచనా వేయగా ఇప్పుడు పరిస్థితి మారింది. అంచనాలకు మించి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి అంచనాలు కాస్తా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు సుదీర్ఘంగా నిర్వహిస్తారు. ఒక అంచనా ప్రకారం కోటిన్నర మంది ప్రజలు కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకుంటారని భావిస్తున్నారు. నాలు గు రెట్లు ఆపరేషన్లు పెరిగే అవకాశమున్నందున ఆ మేరకు ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆసుపత్రులకు అనుమతిచ్చారు. అదనంగా మరో 41 ఆసుపత్రులను గుర్తించారు. ఇలా మొత్తం 111 ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు చేస్తారు. వారందరికీ ఆయా ఆసుపత్రుల్లో ఆప రేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి.  

60 రకాల ఆపరేషన్లు ఉచితంగా.. 
కంటి వెలుగు కింద 60 రకాల ఆపరేషన్లను ఉచితంగా చేస్తారు. ఆరోగ్యశ్రీలో కేవలం 25 వరకు మాత్రమే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుంటే, ఇప్పుడు ‘కంటి వెలుగు’లో 60 వరకు చేస్తున్నట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. అంటే కంటికి సంబంధించిన అన్ని ఆపరేషన్లు ఇందులోనే కవర్‌ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆసుపత్రికి చెల్లిస్తుంది. కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా చేసే పరిస్థితి రావడం తో రాష్ట్రంలో ప్రైవేటు కంటి ఆసుపత్రులు రోగులు లేక వెలవెల పోతున్నాయి. మరోవైపు కంటి అద్దాల  దుకాణాలకు కూడా గిరాకీ తగ్గినట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు