రాష్ట్ర వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు

Published Thu, Nov 2 2023 4:54 AM

Revolutionary changes in the medical field of the state - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ జె.నివాస్‌ చెప్పారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న హరియాణ ట్రైనీ సివిల్‌ సర్విసెస్‌ అధికారుల బృందం బుధవారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో వైద్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ బృందానికి కమిషనర్‌ నివాస్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వేమిరెడ్డి రామిరెడ్డి వివరించారు.

కమిషనర్‌ నివాస్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ,  నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలే ఈ ప్రభుత్వం వైద్యశాఖలో తెచ్చిన మార్పునకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వైద్యపరమైన సమస్యలు, అవసరాలు తీర్చేలా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.250 చొప్పున ఆరునెలల వరకు భృతిని ఇస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి పథకం బహుశా దేశంలోనే ఎక్కడా అమలులో లేదన్నారు.

సీఎం చైర్మన్‌గా వ్యవహరించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యశ్రీతో పాటు 108 ఉచిత అంబులెన్స్‌ సేవలు, ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంతో అనుసంధానమైన 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ సేవలు, ఈహెచ్‌ఎస్, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హరియాణ ట్రైనీ అధికారులు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యరంగంపై ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం అభినందనీయమని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరును తాము పరిశీలించామన్నారు.

10,032 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను నెలకొల్పడమే కాకుండా బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత ఉన్న సీహెచ్‌వోలను నియమించి మారుమూల గ్రామాలకు సైతం వైద్యసేవల్ని విస్తరించడం ప్రశంసనీయమని చెప్పారు. అత్యధిక ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌లను సృష్టించడంలో కూడా దేశంలోనే ఏపీ ముందు నిలిచిందన్నారు. ఏపీలోని వలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను ఎంతో చేరువ చేశారని వారు పేర్కొన్నారు.  

Advertisement
Advertisement