608 బళ్లకు తాళం!

28 Sep, 2014 03:49 IST|Sakshi
608 బళ్లకు తాళం!

ఊహించినట్టే జరిగింది. జిల్లాలో 608 స్కూళ్లకు తాళాలు పడనున్నాయి. దసరా సెలవులకోసం ఈ నెల 23న మూసివేసిన ఈ పాఠశాలలు ఇక తెరుచుకోవు. అంతేకాదు... ఇకనుంచి ఏటా ఇదే తంతు. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు ఎప్పటికప్పుడు మూతపడనున్నాయి. కొత్త రాష్ట్రంలో టీచర్ కొలువులు వస్తాయనకున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇకపై డీఎస్సీ ఊసే ఉండబోదు. స్కూళ్ల మూసివేతతో ఇప్పటికే ఉన్న 3 వేల మంది ఉపాధ్యాయుల సర్దుబాటే సమస్యగా మారనుంది.
 
 సాక్షి, కరీంనగర్ :
 జిల్లాలో 645 ఉన్నత, 332 ప్రాథమికోన్నత, 1963 ప్రాథమిక పాఠశాలలున్నాయి. 2.23 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల క్రమబద్ధీకరణకు కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ 75 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు, ఇంగ్లిష్ మీడియం సక్సెస్ పాఠశాలలు, 19 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం జీవో నంబర్ 6 విడుదల చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాల విద్యారంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ జీవో ప్రకారం జిల్లా వ్యాప్తంగా 560 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 48 ఉన్నత పాఠశాలలు మొత్తం 608 స్కూళ్లు మూతపడనున్నాయి. 130కి పైగా సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్ మాధ్యమం రద్దు కానుంది. ఆఘమేఘాల మీద విడుదలైన జీవోపై ఉపాధ్యాయ సంఘాలన్నీ భగ్గుమన్నాయి. ఏకపక్ష నిర్ణయమంటూ ఖండించాయి. జీవో వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వైఎస్ శర్మ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్‌రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నందికొండ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. గతంలో క్రమబద్ధీకరణ సమయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి విధానపర నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, విద్యాశాఖ ఈ సారి ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కటుకం రమేశ్, జిల్లా అధ్యక్షుడు ఎం.ప్రతాపరెడ్డి, మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జమీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని పేర్కొన్నారు. జిల్లాలో క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి ప్రక్రియ జరగలేదు. ఏ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో జిల్లా విద్యాశాఖ వద్ద ఇంతవరకు స్పష్టమైన సమాచారం లేకపోవడం గమనార్హం.
 అర్ధంతరంగా మూసివేత?
 దసరా సెలవుల్లోనే క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులు లేని స్కూళ్లు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మూతపడుతున్న పాఠశాలల్లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇతర ప్రాతాలకు వెళ్లలేని విద్యార్థులు చదువు మానేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 ఏటా మూతే..!
 ఇకపై ఏటా పదో తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు లేకపోతే ఆ స్కూళ్లు మూసేయాలని ప్రభుత్వం జీవో 6లో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఏటా సర్కారీ స్కూళ్లకు మూసివేత ముప్పు తప్పని పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టకుండా స్కూళ్లు మూసేయాలని నిర్ణయించుకోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 నిరుద్యోగులకు నిరాశే
 టీచర్ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇకపై డీఎస్సీ అవసరముండకపోవచ్చని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. క్రమబద్ధీకరణ పూర్తయితే.. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న మూడు వేల మంది ఉపాధ్యాయులే అదనంగా మిగిలిపోనున్నారు. వీరిని ఎక్కడ సర్ధుబాటులో తెలియక అధికారులు సతమతవుతున్నారు.


 

>
మరిన్ని వార్తలు