వెయ్యి మందికి 881 మంది ఆడ శిశువులు 

31 Jan, 2019 01:35 IST|Sakshi

లింగ నిష్పత్తిలో జాతీయ సగటు కంటే తెలంగాణలో మెరుగు

దేశవ్యాప్తంగా వెయ్యి మంది మగ శిశువులకు 877 మందే ఆడ శిశువులు

పుట్టుక రిజిస్ట్రేషన్‌ ఆధారంగా లింగ నిష్పత్తిని అంచనా వేసిన కేంద్రం 

దేశంలో అబార్షన్లు,భ్రూణ హత్యలు పెరుగుతుండటమే కారణమా?

కేసీఆర్‌ కిట్‌తో పరిస్థితి మెరుగవుతుందంటున్న వైద్యాధికారులు      

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మగ, ఆడ శిశువుల నిష్పత్తి జాతీయ సగటు కంటే కాస్తంత మెరుగ్గా ఉంది. పుట్టుక సందర్భంగా జరిగే రిజిస్ట్రేషన్ల ఆధారంగా లింగ నిష్పత్తిని 2016లో లెక్కగట్టిన కేంద్రం ఆ లెక్కలను తాజాగా విడుదల చేసింది. పుడుతున్న వారిలో జాతీ య సగటులో 1,000 మంది మగ శిశువులు ఉంటే, 877 మంది ఆడ శిశువులు ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఆడ శిశువులు 881 మంది పుట్టారని కేంద్రం తన నివేదికలో తెలిపింది. ఈ విషయంలో ఏపీ చివరన ఉంది. ఏపీలో 1,000 మంది మగ శిశువులకు 806 మంది, రాజస్తాన్‌లోనూ 806 మంది ఆడ శిశువులే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీ, రాజస్తాన్‌లు లింగ నిష్పత్తిలో భారీ తేడాతో చివరిస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో  హెచ్చుతగ్గులు కనిపించాయి. 2015లో జాతీయ సగటు 1,000 మంది మగ శిశువులకు 881 మంది ఆడ శిశువులు పుట్టగా, తెలంగాణలో 834 మంది మాత్రమే. 2016లో తెలంగాణలో 881కు చేరింది. ఏపీలో ఈ సగటు దారుణంగా పడిపోయింది. 2015లో 1,000 మంది మగ శిశువులకు 971 మంది ఆడ శిశువులు పుడితే ఇప్పుడు 806కు పడిపోయింది. తమిళనాడు జాతీయ సగటు కంటే దారుణంగా ఉంది.  

కరీంనగర్‌ జిల్లాలో 713 మందే.. 
కరీంనగర్‌ జిల్లాలో 2014లో 1,000 మంది మగ శిశువులకు ఏకంగా 1080 ఆడ శిశువులు ఉన్నారు. 2015లో 959 మంది ఆడ శిశువులు పుడితే, 2016లో అదికాస్తా దారుణంగా 713 మందికి పడిపోయింది. నల్లగొండ జిల్లాలో 2014లో 1,000 మంది మగ శిశువులకు 1060 మంది ఆడ శిశువులు పుడితే, 2015లో 959 మంది ఉండగా, 2016లో దారుణంగా 773కు పడిపోయింది. హైదరాబాద్, మెదక్‌ జిల్లాల్లో మాత్రం ఇతర జిల్లాల కంటే మెరుగైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కడుపులో ఆడ పిల్ల ఉన్నట్లు గుర్తించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేటు ఆస్పత్రులు అనైతిక చర్యలకు పాల్పడుతుండటంతో అబార్షన్లు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు లింగ నిష్పత్తిలో భారీ తేడా లేకుండా చేశాయంటున్నారు. గతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు అధికంగా జరిగేవి. తర్వాత ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక వసతులు కల్పించింది. దీంతో 2015–16లోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం 30 నుంచి 41 శాతానికి చేరుకున్నాయని చెబుతున్నారు. దీనివల్ల 2016 తర్వాత పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నారు. 

పథకాలతో  మార్పు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి పథకాల వల్ల ఆడ శిశువును కోల్పోవడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడ బిడ్డ పుడితే పెళ్లి ఖర్చు కోసం రూ.లక్ష నూటా పదహార్లు ఇస్తున్నారు. ఇది ఆడ పిల్లల తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం నింపింది.  కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకం కింద మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు ప్రోత్సాహకం ఇస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

జనన ధ్రువీకరణ సులభతరం 
మున్సిపాలిటీలు, గ్రామాల్లో జనన ధ్రువీకరణ ఇప్పటికీ ఒక ప్రహసనంగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాన్ని నమోదు చేసుకోవడం, పొందడం గగనంగా మారింది. ఇప్పు డు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పొందే వీలు కల్పించినా అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పుట్టిన పిల్లల నమోదు పూర్తిస్థాయిలో ఉండటం లేదన్న విమర్శలున్నాయి. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులే సంబంధిత వెబ్‌సైట్‌ లో వివరాలను నమోదు చేయడం ద్వారా జనన ధ్రువీకరణ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ‘వెబ్‌సైట్‌లోకి వెళ్లి శిశువు వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత దాన్ని ప్రింట్‌గా తీసుకుని ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చు. అయితే ఒక శిశువు పేరుతో మరొకటి తీసుకోవడానికి వెబ్‌సైట్‌ అంగీకరించదు’అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు