ప్రేమ పేరుతో వేధింపులు..

23 Feb, 2016 03:21 IST|Sakshi

వేములపల్లి : వారిద్దరూ విద్యార్థులే.. ఒకే తరగతిలో చదువుకుంటున్నారు.. చనువుగా మాట్లాడితే అపార్థం చేసుకున్నాడు.. తనను ప్రేమించాలంటూ ఆరు నెలలుగా వేధిస్తున్నాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని మందలించినా తీర్పు మార్చుకోలేదు. పాఠశాల నుంచి టీసీ ఇచ్చి వెళ్లగొట్టినా వైఖరి మార్చుకోలేదు. బాలిక వెంట పడుతూ వేధిస్తున్నాడు. ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు. నిత్యం అతని వికృతచేష్టలు ఎక్కువవుతుండడంతో తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది.  

పోలీసులు, బంధువులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని శెట్టిపాలెం గ్రా మానికి చెందిన పల్లపు చినవెంకన్న, విజయలకు ముగ్గురు కు మార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె భార్గవి (15) వేములపల్లిలోని మోడల్‌స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. భార్గవి తల్లిదండ్రులు ఉపాధికోసం మహారాష్ట్రలో టెలిఫోన్ కేబుల్ గుంతలు తవ్వే పనికి వెళ్లారు. భార్గవి శెట్టిపాలెంలోనే నాయనమ్మ వద్ద ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వేణు మోడల్‌స్కూల్‌లోనే 10వ తరగతి చదువుతుండేవాడు.

ఈక్రమంలో వేణు రోజు భార్గవిని ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. విషయాన్ని భార్గవి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. దీంతో వేణుకు రెండు నెలల క్రితం టీసీ ఇచ్చి పాఠశాల నుంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి వేణు శెట్టిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యను అభ్యసిస్తున్నాడు. అయినా భార్గవిని వేధించడం మానుకోలేదు .

మోడల్‌స్కూల్‌లోని బాలికల  హాస్టల్‌లో ఉంటున్న భార్గవి వారం రోజుల క్రితమే అస్వస్థతకు గురికావడంతో శెట్టిపాలెంలోని తన ఇంటికి వెళ్లింది. ప్రతిరోజు పాఠశాల వేళకు వచ్చి ఇంటికి వెళుతోంది. వేణు తనను ప్రేమించమని వేధిస్తున్నాడని ఆదివారం రాత్రి వేములపల్లి పోలీసులకు భార్గవి ఫిర్యాదు చేసింది. కాగా సోమవారం ఉదయం భార్గవి నాయనమ్మ సైదమ్మ గ్రామంలోని మిల్లు వద్దకు వడ్లు పట్టించేందుకు వెళ్లింది.

ఇదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పక్కనే ఉంటున్న భార్గవి చిన్నాన్న కొడుకు గమనించి తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు వచ్చి మంటలను ఆర్పే సమయానికే భార్గవి మృతి చెందింది.  విషయాన్ని మహారాష్ట్రలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు వేణు, అజయ్, వంశీపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు