కలాం విజన్‌ ఇదీ..

29 Dec, 2019 03:06 IST|Sakshi

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2020 నాటికి భారత్‌ ఎలా ఉండాలో, దాని రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయనకు ఎన్నో అంచనాలున్నాయి. 2000 సంవత్సరంలో కలాం నేతృత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగంలోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌ (టీఐఎఫ్‌ఐసీ)కు చెందిన 500 మంది నిపుణులతో విజన్‌–2020 డాక్యుమెంట్‌ రూపొందించారు. అప్పటికి భారత్‌ రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయన వైఎస్‌.రాజన్‌ తో కలసి ‘2020: ఏ విజన్‌ ఫర్‌ ది న్యూ మిలీనియం’పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. భారత్‌లో ఉన్న సహజవనరులు, మానవ వనరులు, భారతీయుల్లో నెలకొన్న పోటీతత్వం మన దేశాన్ని శక్తిమంతమైన దేశాల సరసన నిలబెడుతుందని అంచనా వేశారు.

విద్యతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని 2020 నాటికి భారత్‌ అన్ని రంగాల్లోనూ దూసుకుపోయి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుందని ఆకాక్షించారు. అవినీతి రహిత సమాజం ఏర్పాటు కావాలంటే అక్షరాస్యత పెరగాలన్నారు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’అంటూ యువతకు పిలుపునిచ్చారు. భారత్‌ ఆర్థికంగా ఉచ్ఛ స్థితికి చేరుకోవాలంటే 2020 నాటికి స్థూల జాతీయోత్పత్తి 11 శాతంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పన జరిగితేనే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. కలాం కన్న కలలకు అందరూ సలాం చేసినా ఆయన అంచనాలకు దేశం ఏ మాత్రం చేరుకోలేకపోయింది. పైగా సరికొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి.

మరిన్ని వార్తలు