వెంటాడిన మృత్యువు

23 Feb, 2015 03:44 IST|Sakshi
వెంటాడిన మృత్యువు

- పాముకాటుకు గురైన మహిళ..
- ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌ను ఢీకొన్న డీసీఎం  
- డ్రైవర్‌తో పాటు రోగి దుర్మరణం
- ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు  

మొయినాబాద్: మృత్యువు వెంటాడింది..పాముకాటుకు గురైన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అంబులెన్స్‌ను ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొంది. దీంతో డ్రైవర్‌తో పాటు మహిళ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి బస్‌స్టేజీ సమీపంలోని సిలువగుట్ట దగ్గర ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులు, సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. ధారూరు మండలం ధోర్నాల్ గ్రామానికి చెందిన బిస్మిల్లాబీ(25) శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటువేసింది. దీంతో కుటుంబీకులు వెంటనే ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి హైదరాబాద్ తరలించాలని సూచించారు. కాగా కుటుంబీకులు ఆమెను వికారాబాద్‌లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆదివారం మధ్యాహ్నం బిస్మిల్లాబీ పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో ఉస్మానియాకు బయలుదేరారు. మార్గంమధ్యలో హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై మండల పరిధిలోని కనకమామిడి బస్‌స్టేజీ సమీపంలోని సిలువగుట్ట వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంతో అంబులెన్స్‌ను ఢీకొట్టింది. అనంతరం డీసీఎం కొంతదూరం దూసుకెళ్లి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో అంబులెన్స్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సోహెల్(22), పాము కాటుకు గురైన బిస్మిల్లాబీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

అంబులెన్స్‌లో ఉన్న బిస్మిల్లాబీ భర్త సాదిక్, అక్క నూర్జహాన్, చెల్లెలు శభానా, అన్న మహబూబ్, ఆస్పత్రి సిబ్బంది యాదగిరి తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి బంధువు ఇర్ఫాన్‌పాషా స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ రవిచంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ సోహెల్ మృతదేహాన్ని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో సాధిక్ పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్ డ్రైవర్ సోహెల్ వికారాబాద్ వాసి. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
క్షతగాత్రుల హాహాకారాలు...
వికారాబాద్ నుంచి బయలుదేరిన గంటలోపే అంబులెన్స్ వాహనం ప్రమాదానికి గురైంది. సంఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. మహబూబ్, నూర్జహాన్, శభానాల తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరి నడుము విరిగింది.  
 
డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే..  
డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. రోడ్డుకు ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిన డీసీఎం కుడివైపు నుంచి వచ్చి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టినట్లు సంఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. డీసీఎం వాహనం వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
 
ధోర్నాల్‌లో విషాదఛాయలు
ధారూరు: రోడ్డు ప్రమాదంలో బిస్మిల్లాబీ మృతితో మండల పరిధిలోని ధోర్నాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన జానిమియా, మౌలాన్‌బీ దంపతుల కూతురు బిస్మిల్లాబీని అదే గ్రామానికి చెందిన సయ్యద్ సాధిక్ ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.  దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో బిస్మిల్లాబీని పాముకాటు వేసింది. కుటుంబీకులు ఆమెను వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు హైదరాబాద్ తరలించాలని చెప్పినా కుటుంబీకులు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించాక బిస్మిల్లాబీని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని కనకమామిడి గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. ప్రమాదంలో ఆమెతో పాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా మృతిచెందాడు. కుటుం బీకులు తీవ్రంగా గాయపడ్డారు. అందరితో కలుపుగోలుగా ఉండే బిస్మిల్లాబీ మృతితో ధోర్నాల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు