కబళిస్తున్న క్యాన్సర్ | Sakshi
Sakshi News home page

కబళిస్తున్న క్యాన్సర్

Published Mon, Feb 23 2015 3:49 AM

cancer

 లావేరు: ఏడాదిలో ఒక గ్రామంలో ఎనిమిది మంది చనిపోవడం పెద్ద విషయమేం కాదు. కానీ వారందరూ ఒకే వ్యాధితో చనిపోతే.. అది క్యాన్సర్ మహమ్మారి అయితే.. ఖచ్చితంగా ఆందోళనకరమే. అదే ఆందోళనతో మెట్టవలస గ్రామం వణికిపోతోంది. మరో ఇద్దరు ఇదే వ్యాధితో మంచం పట్టడంతో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా క్యాన్సరే అయ్యుంటుందని హడలిపోతోంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా.. తామెన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 
 చిన్న గ్రామానికి పెద్ద కష్టం
 లావేరు మండలంలోని మెట్టవలస చిన్న గ్రామం. 550 నుంచి 600 వరకు జనాభా ఉన్న ఈ గ్రామాన్ని గత ఏడాది కాలంగా క్యాన్సర్ భూతం కబళిస్తోంది. ఒక్కొక్కరిని మృత్యు ఒడిలోకి తీసుకుపోతోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి చందన అప్పారావు, ఎలగాడ రామస్వామి, నొడగల రమణ, మీసాల అప్పమ్మ, కండాపు పారమ్మ, కరిమజ్జి సరస్వతి, నాగవరపు గోవిందమ్మ, ఎలగాడ క్రిష్ణలు మృతి చెందారు. కాగా మీసాల సుశీల అనే మహిళతో పాటు ఆదినారాయణ అనే వ్యక్తి ఈ వ్యాధితో మంచాన పడ్డారు. మృతి చెందిన వారిలో కొందరికి ఎటువంటి దురలవాట్లు లేవని గ్రామస్తులు చెప్పారు. చిన్న వయసు వారిని కూడా క్యాన్సర్ కబళిస్తోంది. మృతి చెందిన నొడగల రమణ వయసు 27 ఏళ్లే కాగా ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్న సుశీల కూడా పిన్న వయస్కురాలే కావడం వారి కుటుంబ సభ్యులను తీవ్ర క్షోభకు గురిచేస్తోంది. గ్రామంలో అత్యధికులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే.  అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అందుబాటులో ఉన్న సాధారణ వైద్యుల వద్దకు వెళ్లడం తప్ప వేలకు వేలు ఖర్చు పెట్టి మెడికల్ టెస్టులు చేయించుకోవాలన్న విషయం తెలియక, వ్యాధి తీవ్రత తెలిసాక ఆర్థిక భారంతో ఉన్నత చికిత్స చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. క్యాన్సర్ కబళిస్తోందని తెలిసిన తర్వాత ఇప్పుడిప్పుడే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.
 
 కారణాలు తెలియడం లేదు
 మెట్టవలసలో క్యాన్సర్ మరణాలు మా దృష్టికి వచ్చాయి. గత డిసెంబరులో మా సిబ్బందితో ఇంటింటా సర్వే చేయించి క్యాన్సర్‌తో మృతి చెందిన వారి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేశాం. సాధారణంగా పారాపరాగ్, గుట్కా, సిగరెట్లు వంటి దురలవాట్లు, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ సోకుతుంది. తాగునీటిలో హెవీ మెటల్స్ ఉన్నా క్యాన్సర్  ప్రబలే అవకాశాలు ఉంటాయి. అయితే క్యాన్సర్‌తో చనిపోయిన వారిలో కొందరికి ఎటువంటి అలవాట్లు లేవు. జన్యుపరమైన లోపాలు ఉన్నాయేమో తెలియదు. క్యాన్సర్‌తో బాధ పడి చనిపోయినవారెవరూ చికిత్స కోసం మా పీహెచ్‌సీకి రాలేదు. క్యాన్సర్ వైద్య నిపుణులతో అధ్యయనం చేయిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదించాం.
 -ఎం.సంధ్య, వైద్యాధికారి, లావేరు పీహెచ్‌సీ
 
 అధికారులు పట్టించుకోవడం లేదు
 గ్రామంలో క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాధి ప్రబలడానికి కారణాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేయించాని గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌కు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. చిన్న వయసు వారు కూడా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.        
 -నారాయణరావు, శ్రీక్రిష్ణ యువజన సంఘం అధ్యక్షుడు
 
 భయంగా ఉంది
 గ్రామంలో ఏడాదిలో 8 మంది క్యాన్సర్‌తో చనిపోవడంతో భయంగా ఉంది. ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా క్యాన్సర్ సోకిందేమోనని ఆందోళన చెందుతున్నాం. అధికారులు స్పందించి క్యాన్సర్ అరికట్టే చర్యలు చేపట్టాలి.
 -కరిమజ్జి రామారావు, గ్రామస్తుడు
 

Advertisement
Advertisement