ఓటుకు రసీదు ఇవ్వాలి

24 Feb, 2016 03:44 IST|Sakshi
ఓటుకు రసీదు ఇవ్వాలి

హైకోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లకు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే దానికి రసీదు వచ్చే ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఓటు సరిగా నమోదైందో లేదో తెలుసుకునేందుకు వయబుల్ ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) విధానాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేట్లు ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డి.శ్రవణ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎన్.రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన 45 రోజులకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయని, ఇందులో ఉపయోగించిన ఈవీఎంలలో నోటా లేదని పిటిషనర్లు తెలిపారు. నోటాను తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు.

ఓటు వినియోగించుకున్న వెంటనే రసీదు వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. వీవీపీఏటీ విధానాన్ని అమలు చేయాలని 2013లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికల్లో నోటా లేదా వీవీపీఏటీ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నోటా లేదా వీవీపీఏటీ విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని, మధ్యంతర అభ్యర్థన, ప్రధాన అభ్యర్థన ఒకే రకంగా ఉన్నందున తుది విచారణ జరిపిన తరువాతనే తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు