కల్తీ మద్యం... బతుకు ఛిద్రం

7 Dec, 2014 00:08 IST|Sakshi

సంగారెడ్డి క్రైం:  కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్న మద్యాన్ని కల్తీ చేస్తున్న అక్రమార్కులు మందుబాబుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. మద్యం బాటిళ్లపై సీల్ ఉన్నప్పటికీ కల్తీకి చేసేస్తున్నారు. బాటిల్‌లోని మద్యాన్ని సిరంజితో తీయడం అందులో నీటిని గానీ స్పిరిట్‌తో తయారు చేసిన మద్యాన్ని కానీ కలిపేస్తున్నారు. ఈ తరహా మోసాలను అరికట్టడం ఎక్సైజ్ శాఖకు సవాల్‌గా మారింది. జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో మద్యం ఒక్కోచోట ఒక్కో తీరుగా ఉంటోందని మందుబాబులు అంటున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో మద్యం కల్తీ అవుతోందని, ఆ మద్యం తాగిన వారికి కాళ్లు, చేతులు లాగడం, శరీరం నీరసంగా ఉంటుందని చెబుతున్నారు.

పేరుకే ఎంఆర్‌పీ

జిల్లాలోని చాలా దుకాణాల్లో ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంతోపాటు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులు మద్యం బాటిళ్లకు రూ.5 నుంచి రూ.40 వరకు ఎంఆర్ పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టముంటే కొనండి లేదంటే లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మద్యం బాటిళ్లకు ఉచితంగా ఇవ్వాల్సిన కవర్‌కు సైతం రూ.3 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.

నిబంధనలకు నీళ్లు

ఉదయం 10.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకే మద్యం విక్రయాలు కొనసాగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, జిల్లా ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు తెరిచే ఉంచుతున్నారు. దీంతో అర్ధరాత్రి దాకా పీకలదాకా తాగుతున్న మందుబాబులు రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు

జిల్లా వ్యాప్తంగా 162 మద్యం దుకాణాలు కొనసాగుతుండగా,  మొత్తం 11 సర్కిళ్లు ఉన్నాయి. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 6 సర్కిళ్ల (సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్)లో 87 మద్యం దుకాణాలున్నాయి. మెదక్ డివిజన్ పరిధిలోని ఐదు సర్కిళ్ల (మెదక్, సిద్దిపేట, గజ్వేల్, మిర్‌దొడ్డి, రామాయంపేట)లో 75 మద్యం దుకాణాలున్నాయి. మద్యం కల్తీ కాకుండా, అధిక ధరకు విక్రయించకుండా ఎక్సైజ్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. కానీ వారంతా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో ఎక్సైజ్ అధికారులు ఏ ఒక్క దుకాణాన్ని సైతం తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు అడపాదడపా తనిఖీలు నిర్వహించినా అవన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో మద్యం వ్యాపారులు ఆడింది ఆటా, పాడింది పాటగా తయారైంది.

ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించడం, మద్యాన్ని కల్తీ చేసేయడం వ్యాపారులకు అలవాటుగా మారిపోయింది. దీంతో మందుబాబులు జేబుతో పాటు శరీరాన్నీ గుల్ల చేసుకుంటున్నారు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్‌లు ఏర్పాటు చేయడంతో మందుబాబులంతా అక్కడ తాగేసి రోడ్లపై చిందులు వేస్తున్నారు. దీంతో ఆ దారి వెంట వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు