ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది

24 Aug, 2017 02:59 IST|Sakshi
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది

టీఆర్‌ఎస్‌పై రాష్ట్రపతికి అఖిల పక్షం ఫిర్యాదు
దళితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు
బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అఖిల పక్ష, టీజేఏసీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై పోలీసులను ప్రయోగించి చిత్రహింసలకు గురిచేస్తోందని రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం  కేసీఆర్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.  

న్యాయవిచారణ జరిపేలా ఆదేశించండి..
ఇసుక దందాలకు పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న దళితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తన బంధువులతో కలసి నడుపుతున్న ఇసుక దందాను ప్రశ్నించిన నేరెళ్లకు చెందిన 8 మంది దళితులను పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించారు. నేరెళ్లలో ఎస్పీ దగ్గరుండి మరీ దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా స్వతంత్ర కమిషన్‌తో విచారణ జరిపేలా డీజీపీని ఆదేశించాలని, బాధితులకు నష్టపరిహారమందేలా చూడాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ నియంతృత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. ఉద్యోగాల కోసం యువత, వ్యవసాయంలో చేయూత కోసం రైతులు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వారిని అణగదొక్కుతోందన్నారు. సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఎలా కాలరాస్తోందో రాష్ట్రపతికి సమర్పించినట్లు చెప్పారు. దళితులపై జరుగుతున్న దాడులపై విచారణ జరిపించాలని చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించార న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఎంపీటీసీ ఉపట్ల శ్రీనివాస్‌పై జరిగిన దాడిని కోదండరాం ఖండించారు.

మరిన్ని వార్తలు