పర్యాటక కేంద్రంగా అల్లూరి నివాసం

8 Jul, 2015 01:02 IST|Sakshi

క్షత్రియ సేవా సమితి డిమాండ్
 
హైదరాబాద్: స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి  చేయాలని క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ కేవీఎల్‌ఎన్ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న అల్లూరి ఇంటిని పునర్ నిర్మించాలన్నారు.

అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ హైదరాబాద్‌లో అల్లూరి స్మృతి వనం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలసి కోరతామన్నారు. సమావేశంలో క్షత్రియ సేవా సమితి ఉపాధ్యక్షులు బీహెచ్ సత్యనారాయణ రాజు, కార్యదర్శి ఎం.పెద్దిరెడ్డి, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు