బాహుబలి రైలింజిన్‌..

19 Jun, 2019 03:02 IST|Sakshi

మన గూడ్సు రైలుకు అమెరికా లోకోమోటివ్‌

6 వేల హెచ్‌పీ శక్తి... బరువు తక్కువ, వేగమెక్కువ

రెండు ఇంజిన్లలో ఒకటి దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపు

వికారాబాద్‌–వాడీ సెక్షన్‌ మధ్య త్వరలో పరుగులు  

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక రూపాన్ని సంతరించుకుంటున్న భారతీయ రైల్వే అధునాతన లోకోమోటివ్‌ (ఇంజిన్లు)లపై దృష్టి సారించింది. ముఖ్యంగా సరుకు రవాణా రైళ్లకు శక్తివంతమైన ఇంజిన్లు అవసరం కావటంతో ఇప్పుడు భారీ లోకోమోటివ్‌లను సమకూర్చుకుంటోంది. ఇప్పటివరకు సంప్రదాయ ఇంజిన్లనే వాడుతుండటంతో ఎక్కువ లోడ్‌ ఉండే సరుకు రవాణా రైళ్లను వేగంగా గమ్యం చేర్చటం ఇబ్బందిగా మారింది. ఎక్కువ లోడ్‌ను తక్కువ సమయంలో తరలించేందుకుగాను అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్‌లు వాడాలని గతంలోనే మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమెరికా పెన్సిల్వేనియాలో ఉండే జనరల్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ రూపొందించిన ఇంజిన్లు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే పెన్సిల్వేనియా ప్లాంట్‌ నుంచి కొన్ని ఇంజిన్లను తెప్పించుకోగా తాజాగా మరో రెండు వచ్చాయి. వీటిల్లో ఒకదాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మౌలాలి లోకో వర్క్‌షాప్‌కు కేటాయించారు. దీన్ని వికారాబాద్‌–వాడీ సెక్షన్ల మధ్య నడపనున్నారు. త్వరలో ట్రయల్‌ రన్‌ మొదలు పెడతారు.  

6,000 హార్స్‌పవర్‌ శక్తి..
ప్రస్తుతం మన రైల్వేలో దాదాపు నాలుగు వేలు, నాలుగున్నర వేల హార్స్‌పవర్‌ శక్తి ఉండే ఇంజిన్లను వినియోగిస్తున్నారు. బొగ్గు, సిమెంటు లాంటి బరువైన సరుకును రవాణా చేసేందుకు ఈ ఇంజిన్ల శక్తి సరిపోవటం లేదు. దీంతో రెండుమూడు ఇంజిన్లు ఏర్పాటు చేసి లాగుతున్నారు. దీనివల్ల సాంకేతిక సమస్యలు రావటం, నెమ్మదిగా రైలు కదలటంతో సరుకు రవాణాలో జాప్యం జరుగుతోంది. రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు సరుకు రవాణానే కావటంతో, ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలంటే సరుకును వేగంగా తరలించడమే మార్గమని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం ఎక్కువ శక్తి ఉండే ఇంజిన్లను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కానీ మన దగ్గర అంతకంటే శక్తివంతమైన లోకోలు తయారు కావటం లేదు. దీంతో  అమెరికాకు చెందిన జీఈ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ ఆరు వేల హార్స్‌పవర్‌ ఉండే లోకోమోటివ్‌లను మన దేశానికి ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం వచ్చిన రెండు ఇంజిన్లు కూడా ఇంతే శక్తివంతమైనవి. ఇవి తేలికగా ఉండటంతోపాటు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ పని అందిస్తాయని అధికారులు అంటున్నారు. వీ6 ఎవల్యూషన్‌ కలిగిన 16 సిలిండర్లతో కూడిన 4 స్ట్రోక్‌ టర్బో చార్జ్‌డ్, ఇంటర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. దీని నుంచి వెలువడే కర్బణ ఉద్గారాలు కూడా చాలా తక్కువ అయినందున పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. దాదాపు 100 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. 

వేయి ఇంజిన్ల ఆర్డర్‌..
మన రైల్వే జీఈ కంపెనీతో వేయి ఇంజిన్ల కోసం ఒప్పందం చేసుకుంది. దీంతో తొలుత పెన్సిల్వేనియాలోని ప్లాంట్‌ నుంచే కొన్ని ఇంజిన్లను దిగుమతి చేసుకున్నా... బీహార్‌లో ఆ కంపెనీ సొంతంగా ఓ తయారీ సంస్థను ఏర్పాటు చేసుకుంది. ఇక ఇక్కడే వాటిని రూపొందించనుంది. ఇక్కడే దాదాపు వేయి లోకోమోటివ్‌లను రూపొందించి మన రైల్వేకు అప్పగించనుంది. ప్రస్తుతం ఒక్కో లోకోమోటివ్‌కు రైల్వే శాఖ రూ.15 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం.  

ఎలక్ట్రిక్‌ అన్నారు..డీజిల్‌ ఇంజన్లు తెచ్చారు! 
ప్రస్తుతం జీఈ కంపెనీ సరఫరా చేస్తున్న ఇంజిన్లు డీజిల్‌తో నడిచేవి. 2022 నాటికి రైల్వే మొత్తాన్ని ఎలక్ట్రిఫికేషన్‌ చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు వేగంగా కారిడార్లను ఎలక్ట్రిఫై చేస్తున్నారు. కానీ ఇప్పుడు జీఈ కంపెనీ నుంచి అంత ధర పెట్టి డీజిల్‌ ఇంజిన్లు కొంటుండటం విశేషం. ప్రతి రెండుమూడు కి.మీ.కు లీటర్‌ డీజిల్‌ను ఈ లోకోమోటివ్‌లు ఖర్చు చేస్తాయని పేర్కొంటున్నారు. త్వరలో మౌలాలి వర్స్‌షాప్‌కు చేరే కొత్త లోకోమోటివ్‌ వికారాబాద్‌–వాడీ సెక్షన్ల మధ్య తిరుగుతుంది. దాదాపు 200 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మార్గంలో ఎత్తుపల్లాలు, వంకరటింకర మలుపులు ఎక్కువగా ఉన్నందున కొత్త ఇంజిన్‌ పనితీరును సులభంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులంటున్నారు. తక్కువ ట్రాఫిక్‌ ఉండే ఈ మార్గంలో సరుకు రవాణా కూడా ఎక్కువగా ఉంటుండటం మరో కారణంగా పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా