కీసరలో దేవాదాయ నిర్మాణాల కూల్చివేతకు యత్నం

25 Jul, 2014 00:02 IST|Sakshi

 కీసర: కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆలయానికి సంబంధించిన పలు నిర్మాణాలను ఓ ప్రైవేటు వ్యక్తి కూల్చివేయడానికి ప్రయత్నించడం గురువారం తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు స్థలం ఓ ప్రైవేటు వ్యక్తికి చెందినది కావడంతో సమస్య ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కీసర వాణి సమీపంలోని సర్వే నం: 200/4లో దాదాపు 11 ఎకరాల్లో భూమి ఉంది. ఈ భూమిలో ఏటా కీసరగుట్టలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎగ్జిబిషన్ స్టాల్స్, జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు.

 ఈమేరకు అక్కడ కళా వేదిక నిర్మాణంతోపాటు, భక్తుల సౌకర్యార్థం మినీ తాగునీటి ట్యాంకులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ సర్వే నంబర్‌లోని ఎనిమిదిన్నర ఎకరాల భూమి బోగారం గ్రామానికి చెందిన చేవూరి రఘునందనరావు పేరిట ఉంది. ఈ స్థలాన్ని వాడుకుంటున్నందుకు పట్టాదారును స్థలదాతలుగా కీసర దేవస్థానం గుర్తిస్తూ వస్తోంది.

 కూల్చివేతలకు ప్రయత్నించిన  పట్టాదారుడు
అయితే గురువారం ఈస్థలాన్ని స్వాధీ నం చేసుకునే క్రమంలో పట్టాదారు అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు జేసీబీ సాయంతో పనులు చేయిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే ఆ స్థలంలో మోదుగు వృక్షాల చుట్టూ ఉన్న దిమ్మెలను కూల్చివేశారు. ఈ సమాచారాన్ని తహసీల్దార్ రవీందర్‌రెడ్డికి, కీసరగుట్ట దేవస్థానం వారికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తహసీల్దార్ కూల్చివేతలను నిలిపివేయించారు. రికార్డుల ప్రకారం స్థలం ప్రైవేటు వ్యక్తికి చెందినదైనప్పటికి చాలా ఏళ్లుగా ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇక్కడ పలు నిర్మాణాలను చేపట్టిందన్నారు.

 ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదన్నారు. స్థలం మొత్తం సర్వేచేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని, అంతవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని స్థలయజమానికి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు