‘అంగన్‌వాడీ’ల బడిబాట 

5 Jun, 2019 06:34 IST|Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్‌వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించనున్నారు. బాలబాలికలు, ఐదేళ్లలోపు పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో, ఐదేళ్లు దాటితే పాఠశాలల్లో ఉండాలనే నినాదంతో పట్టణాలు, గ్రామాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బడిబాట నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలోని ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో 11వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ప్రదర్శనలు నిర్వహించి.. చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడేళ్లు వచ్చిన ప్రతి చిన్నారి అంగన్‌వాడీ కేంద్రంలో చేరాల్సిన ఆవశ్యకత, అవసరాన్ని స్థానికులకు వివరించేలా అంగన్‌వాడీ టీచర్లను సన్నద్ధం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, పోషక పదార్థాల వివరాలు బడిబాటలో ప్రతి ఒక్కరికి వివరించనున్నారు.
 
మంచి విద్యను అందించేందుకు.. 
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్లు నిండిన పిల్లలను చేర్చేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహించాల ని ఇప్పటికే నిర్ణయించారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ–స్కూల్‌ కార్యక్రమంగా భావించేవారు. పాఠశాలకు వెళ్లడం చిన్నారులకు అలవాటు చేసేందుకు ఉపయోగపడగా.. మరోవైపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి.. వారితో ఆటలు ఆడించి.. పాఠశాల అంటే భయం పోగొట్టేందుకు పనిచేసేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా మార్పులు తెచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం.. ఆట పాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. చిన్నారులకు వర్క్‌బుక్‌లను అందించి.. వారితో హోమ్‌ వర్క్‌ చేయించాలని నిర్ణయించారు. జిల్లాలో 7 ప్రాజెక్టుల కింద మొత్తం 1,896 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,605 మెయిన్‌ కేంద్రాలు కాగా.. 291 ఉప కేంద్రాలున్నాయి. వీటిలో చిన్నారులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కార్యక్రమాలు ఇలా.. 
బడిబాట సందర్భంగా ఏ రోజు.. ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారుల నుంచి వివరాలు వచ్చా యి. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవా రం గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందు లో అంగన్‌వాడీ టీచర్లతోపాటు ఆయాలు, స్వ యం సహాయక సంఘాలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాల్సి ఉంటుంది.  అలాగే బడి మానేసిన ఆడపిల్లలను కూడా తిరిగి బడిలో చేర్పించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.  ఇక ఈనెల 7, 8 తేదీల్లో ఇంటింటికీ తిరిగి రెండున్నరేళ్ల పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అడ్మిషన్ల గురించి.. ప్రీ–స్కూల్‌ సిలబస్‌ గురించి, అక్కడ ఉండే టైమ్‌ టేబుల్, వర్క్‌ బుక్స్, పిల్లలకు ఇచ్చే యాక్టివిటీ బుక్స్, ప్రీ–స్కూల్‌ కిట్‌ మెటీరియల్‌ గురించి వివరిస్తారు.

ఇక 10వ తేదీన అంగన్‌వాడీలో చేరిన పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యను అందించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రులు, వారి బంధువులను ఆహ్వానిస్తారు. గ్రామ పెద్దలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి.. అంగన్‌వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను ఎందుకు చేర్పించాలో వివరించేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రీ–స్కూల్‌ మెటీరియల్‌ను బహిరంగంగా ప్రదర్శనలో ఉంచుతారు. ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలను గుర్తించి.. తల్లిదండ్రులకు బహుమతులు అందించనున్నారు. ఇక 11వ తేదీన స్వచ్ఛ అంగన్‌వాడీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని శుభ్రపరచడం, ఆవరణను శుభ్రం చేసి అనవసరంగా ఉన్న సామగ్రిని తొలగిస్తారు. ఆవరణలో మొక్కలు నాటుతారు. మంచినీటి సదుపాయం కల్పించడంతోపాటు టాయిలెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటారు. దీంతో అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం ముగిసినట్లవుతుంది.  

ప్రతి వాడలో అంగన్‌వాడీ బడిబాట..
జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రతి వీధిలో, వాడలో అంగన్‌వాడీ బడిబాట నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులను పాల్గొనేలా చేసి.. వారికి ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించి, వాటిపై అవగాహన కల్పిస్తాం. అంగన్‌వాడీల్లో ఐదేళ్ల వయసులోపు పిల్లలు ఎందుకు చేరాలనే ఆవశ్యకతను బాడిబాటలో వివరించనున్నాం. – ఆర్‌.వరలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ

మరిన్ని వార్తలు