కాలేజీ రోజుల్లో ఢిల్లీ పోలీస్‌తో ‘ఢీ’

13 Mar, 2018 08:01 IST|Sakshi

బాస్కెట్‌బాల్‌ ఆటలోనే సుమా...

పోలీసులతో మమేకమై పెరిగా ఆ యూనిఫాం అంటే గౌరవం

టీమ్‌ వర్క్‌తో ముందుకు సాగుతా...

‘సాక్షి’తో సిటీ కొత్వాల్‌ అంజనీకుమార్‌

‘కాలేజీ రోజుల్లో ఢిల్లీ పోలీసునే ఢీ కొట్టాం. ఆ కాస్సేపు నువ్వానేనా అన్నట్లు పోరాడాం. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్‌ బాస్కెట్‌ బాల్‌ టీమ్‌లో నేను ఉండగా ఢిల్లీ పోలీసు టీమ్‌పై ఆడినప్పటి మాట ఇది...’ అంటూ సిటీ కొత్త కొత్వాల్‌ అంజనీ కుమార్‌ తన జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో పోలీస్‌ యూనిఫాం అంటే ఎంతో క్రేజ్‌ ఉండేదని..ఆ క్రేజ్‌తోనే ఐపీఎస్‌ ఆఫీసరనయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. తనకు హార్స్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టమన్నారు. టీమ్‌వర్క్‌ ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధ్యమని, తాను అందరినీ కలుపుకొనిపోయి నగరంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తానని చెప్పారు.  హైదరాబాద్‌కు 57వ పోలీసు కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో అంజనీకుమార్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....       

సాక్షి, సిటీబ్యూరో : ‘బీహార్‌లోని పట్నాలోనే నా బాల్యం, స్కూలు జీవితం గడిచిపోయాయి. డిగ్రీ, పీజీ చేయడం కోసం ఢిల్లీ చేరుకున్నా. ఢిల్లీ యూనివర్శిటీతో పాటు దాని ఆధీనంలోని కాలేజీల్లో చదివా. స్కూలు రోజుల నుంచే నేను స్పోర్ట్స్‌  పర్సన్‌ను. అనేక స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. బాస్కెట్‌బాల్, క్రికెట్‌ టీమ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. ఆయా సందర్భాల్లో జరిగిన అనేక ఫంక్షన్లకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యే వారు. దీంతో వారిని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కింది. అప్పట్లో నాకు పోలీసు యూనిఫాం అంటే ఎంతో క్రేజ్‌. ఆగస్టు 15, జనవరి 26న జరిగే పెరేడ్స్‌ ఎంతో స్ఫూర్తి నింపాయి. అప్పట్లోనే పోలీసు అవ్వాలని నిర్ణయించుకున్నా. 

ఇప్పుడది ఓ బాధ్యతగా మారింది...
చిన్నప్పటి నుంచీ జాతీయ జెండాను చూసినా, జాతీయ గీతం విన్నా బయటకు చెప్పలేని పాజిటివ్‌ భావన కలిగేది. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్‌లో చదివే రోజుల్లో బాస్కెట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించా. అప్పట్లో మా జట్టు ఢిల్లీ పోలీసు జట్టుతో హోరాహోరా పోరాడి గెలిచింది. ఇలా పోలీసు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జట్లతోనూ ఆట ఆడాం. 1990లో ఐపీఎస్‌కు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌కు అలాట్‌ అయ్యా. జనగాం ఏఎస్పీగా కెరియర్‌ ప్రారంభించా. ప్రస్తుతం యూనిఫాం అన్నది ఓ బాధ్యతగా మారిపోయింది. 80 లక్షల జనాభా ఉన్న సిటీకి పోలీసు కమిషనర్‌గా రావడం ఈ బాధ్యతని మరింత పెంచింది. నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి, డీజీపీల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా.

వీవీ శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న అంజనీకుమార్‌
ప్రస్తుతం వాటికి పూర్తిగా దూరమైపోయా...  
నగరంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ తీసుకునే రోజుల్లో గుర్రపు స్వారీ, ఈతపై ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు అంశాల్లోనూ మంచి ప్రతిభ కనబరుస్తూ వచ్చా. అధికారిగా పోస్టింగ్స్‌ తీసుకున్న తర్వాత కూడా ఖాళీ దొరికినప్పుడల్లా క్రీడాకారుడిగా, హార్స్‌ రైడర్‌గా మారిపోయేవాడిని. నగర పోలీసు విభాగంలో అదనపు సీపీగా పని చేసిన రోజుల్లోనూ దాన్ని కొనసాగించా. అయితే అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటికి పూర్తిగా దూరమయ్యా. ఆ ఆటలు ఆడే అవకాశమే దక్కలేదు. గతంలో నగరంలో పని చేసిన అనుభవం ఇప్పుడు ఉపయుక్తంగా మారుతుంది. హైదరాబాద్‌ లాంటి నగరానికి సేవ చేసే అవకాశం దక్కడం అరుదైన అవకాశమే. 

టీమ్‌ వర్క్‌తోనే ముందుకు...
సిటీ పోలీసింగ్‌ అంటే టీమ్‌ వర్క్‌. పోలీసు కమిషనర్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకు ప్రతి స్థాయి అధికారీ ఇన్‌వాల్వ్‌ కావాలి. సీఎం, డీజీపీ నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి అదే పంథాలో పనిచేస్తాం. పోలీసు బాస్‌ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచనలతో అనేక విధానాలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంబంధిత ప్రాజెక్టులు సిటీలో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రానికే నగరం రోల్‌ మోడల్‌గా మారింది. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తూ సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి, మార్పు చేర్పులు చేస్తుంటాం. పోలీసు విభాగంలో ఏ స్థాయిలోనూ అవినీతిని ఉపేక్షించేది లేదు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా పక్కాగా విచారణ చేపడతాం. వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అంజనీ కుమార్‌ అన్నారు.

ఎన్‌కౌంటర్‌ తర్వాత తీవ్ర కలకలం, సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం వ్యవహారాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్‌ ఐజీ వై.నాగిరెడ్డి అయినప్పటికీ ఆ విచారణను పర్యవేక్షించింది మాత్రం అదనపు డీజీ హోదాలో అంజనీ కుమారే.

పోలో టీమ్‌ ఆయన డ్రీమ్‌...
బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు ఇన్‌చార్జ్‌ సీపీ వీవీ శ్రీనివాసరావు నుంచి అంజనీ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నగర పోలీసు అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గోషామహల్‌లో ఉన్న నగర పోలీసు అశ్వక దళం 2013కు ముందు తీవ్ర నిరక్ష్యానికి గురైంది. స్టేబుల్స్‌గా పిలిచే గుర్రపు శాలలు సైతం రూపు కోల్పోయాయి. అప్పట్లో నగర అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతహాగా అశ్వ ప్రియుడు, రైడర్‌ కావడంతో జాతీయ పోలీసు అకాడెమీతో పాటు వివిధ రేస్‌ కోర్స్‌లు, స్టడ్‌ ఫామ్స్‌ తిరిగి అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేబుల్స్‌ను డిజైన్‌ చేశారు. ఆయన కృషి వల్లే 10 కొత్త గుర్రాలు సైతం నామమాత్రపు ధరకు సమకూరాయి. ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్స్‌/స్పోర్ట్స్‌ మీట్స్‌లో పాల్గొనేందుకు సిటీ పోలీసు తరఫున పోలో టీమ్‌ను తయారు చేయాలన్నది అప్పట్లో అంజనీ డ్రీమ్‌.  

80 లక్షల జనాభా కలిగిన ఇంత పెద్ద  సిటీకి కమిషనర్‌గా పనిచేయడం గర్వంగా ఉంది. నాకు ఈ బాధ్యత అప్పగించిన సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డిలకు  కృతజ్ఞతలు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించి వారి నమ్మకాన్ని నిలబెడతా. – బాధ్యతల స్వీకరణ అనంతరం కొత్త పోలీస్‌ బాస్‌ అంజనీకుమార్‌ 

మరిన్ని వార్తలు