జూరాలలో మరో సోలార్‌ ప్రాజెక్టు

18 Sep, 2019 07:39 IST|Sakshi
జూరాల ప్రాజెక్టు వద్ద సోలార్‌ విస్తరణకు అవకాశం ఉన్న స్థలం ఇదే..

ఎగువ జూరాలలో మరో 8 మెగావాట్ల యూనిట్‌ 

దిగువ జూరాలలో 11 మెగావాట్ల యూనిట్‌ ఏర్పాటు 

ప్రాజెక్టు వద్ద మిగులు స్థలాల్లో సోలార్‌ పవర్‌ స్టేషన్‌ 

త్వరలోనే విస్తరణ పనులు 

సాక్షి, ద్వాల టౌన్‌: జూరాల, లోయర్‌ జూరాల ప్రాజెక్టుల వద్ద మరో 19 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎగువ జూరాల జలవిద్యుత్‌ కేంద్రం వద్ద ఐదు ఎకరాల్లో ఒక మెగావా ట్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కేంద్రం విజయవంతమైంది. ఈ ప్రాంతంలో అ న్ని సీజన్లలోనూ పగటి పూట 30 డిగ్రీలకు తగ్గకుండా ఎండ తీవ్రత ఉంటుంది. కాబట్టి సోలా ర్‌ విస్తరణకు సరైన ప్రాంతం కావడంతో విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా విద్యుదుత్పత్తి చేయడంతోపా టు ప్రాజెక్టుల వద్ద మిగులు భూముల్లో సోలార్‌ పవర్‌ విస్తరణకు మొగ్గుచూపుతున్నారు. 

50 ఎకరాల మిగులు భూమిలో 
ఎగువ జూరాల ప్రాజెక్టు వద్ద 2012 నుంచి ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి నిరాటంకంగా సాగుతోంది. దీంతో జూరాల వద్ద మిగులుగా ఉన్న మరో 50 ఎకరాల భూమిలో మరో 8 మెగావాట్ల విద్యుత్‌ను అందించేలా సోలార్‌ యూనిట్‌ను విస్తరించాలని నిర్ణయించారు. లోయర్‌ జూరాల వద్ద మిగులుగా ఉన్న సాగునీటి శాఖకు చెందిన 90 ఎకరాల భూమిలో మరో 11 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటులో ఒక మెగావాట్‌ విద్యుత్‌ను అందించేలా సోలార్‌ యూనిట్ల పరికరాలను అమర్చడానికి రూ.3 కోట్ల మేర వ్యయమవుతుంది. జూరాల, లోయర్‌ ప్రాజెక్టులతోపాటు తెలంగాణలో సాగునీటి శాఖ వద్ద మిగులుగా ఉన్న భూముల్లో సోలార్‌ యూనిట్లను నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందించారు.

పులిచింతల ప్రాజెక్టు వద్ద 20 మెగావాట్లు, పాల్వంచ కేటీపీఎస్‌ వద్ద 8 మెగావాట్లు, పెద్దపల్లి వద్ద 5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నిర్మించేందుకు ఇప్పటికే డీపీఆర్‌ చేశారు. వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. కేటీపీఎస్, పులిచింతల, పెద్దపల్లి ప్రాజెక్టుల మిగులు భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా మొదటి దశ పనులకు రూ.75 కోట్లతో టెండర్లను పూర్తి చేయడంతోపాటు ఒప్పందాలు చేయడంతో పనులు ప్రారంభం కానున్నాయి. జూరాల, లోయర్‌ ప్రాజెక్టుల వద్ద సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచితే వేసవిలో గ్రిడ్‌ ద్వారా ఈ ప్రాంతానికి విద్యుత్‌ను అందించేందుకు మరింత సౌలభ్యం ఏర్పడనుంది.
 
ఆదాయం ఇచ్చే వనరు.. 
సాగునీటి ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్‌తోపాటు సోలార్‌ విద్యుదుత్పత్తి విస్తరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జూరాల, లోయర్‌ జూరాల ప్రాజెక్టుల వద్ద సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయించాం. మిగులు భూముల్లో సోలార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మరింత విద్యుత్‌ను అందుకోడానికి వీలవుతుంది. ఒక మెగావాట్‌కు ఒకేసారి పెట్టుబడి పెడితే దాదాపు రెండు దశాబ్దాలపాటు ఉత్పత్తి అందిస్తుంది. కేవలం నిర్వహణ చేయాల్సి ఉంటుంది. జెన్‌కోకు సోలార్‌ కూడా అధిక ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మారింది.  – సురేష్, సీఈ, టీఎస్‌ జెన్‌కో  

మరిన్ని వార్తలు