రంగారెడ్డిలో మరో రెండు రక్షణ సంస్థలు!

15 Apr, 2017 23:33 IST|Sakshi
రంగారెడ్డిలో మరో రెండు రక్షణ సంస్థలు!

- ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌ కోసం భూముల అన్వేషణ
- ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌కు 1,000 నుంచి 2,000 ఎకరాలు
- ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రక్షణ రంగ సంస్థలకు రంగారెడ్డి జిల్లా హబ్‌గా మారింది. ఇప్పటికే పలు సంస్థలను అక్కున చేర్చుకున్న జిల్లా తాజాగా సశస్త్ర సీమాబల్, సీఐఎస్‌ఎఫ్‌లను కూడా సరసన చేర్చుకుంటోంది. శత్రుసేనలను తుదముట్టించేందుకు దేశ సరిహద్దుల్లో పహారా కాసే సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), పారిశ్రామిక రక్షణ దళం (సీఐఎస్‌ఎఫ్‌)కు చెరో 70 ఎకరాలను కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపా దనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆక్టోపస్, ఎన్‌ఎస్‌జీ, బీఎస్‌ఎఫ్, ఎన్‌పీఏ తదితర సంస్థలకు కేంద్రంగా మారిన రంగారెడ్డి జిల్లా.. తాజాగా మరిన్ని సంస్థలకు ఆహ్వా నం పలుకుతోంది.

ఈ రెండింటికి కూడా ఇబ్రహీం పట్నం మండలంలో భూములు కేటాయించే అం శాన్ని యంత్రాంగం పరిశీలిస్తోంది. మరోవైపు ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌కు ఏకంగా 1000ృ2000 ఎకరాలు కావాలని కోరుతూ రక్షణ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంలో వివిధ చోట్ల ఆర్మీకి ఉన్న భూములను ప్రజోపయోగ అవసరాలకు తీసుకున్నందున ప్రత్యామ్నా యంగా ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌కు ఈ మేరలో భూమి ఇవ్వాలని కోరింది. రక్షణ శాఖ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కారు భూములను గుర్తిం చాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిం చింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషన రేట్‌కు కూడా ఫైరింగ్‌లో శిక్షణ కోసం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ లో 18 ఎకరాలను కేటాయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదే మండలంలోని రామోజీ ఫిలింసిటీకి పర్యాటకా భివృద్ధిలో భాగంగా 295 ఎకరాలను అప్పగించాలని నిర్ణయించారు. దీని పై వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశముం దని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అకాడమీ స్థాపిం చేందుకు భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, మొయినాబాద్‌ మండలాల పరిధిలో పలు చోట్ల భూములను రెవెన్యూ యంత్రాంగం అన్వేషిస్తోంది.

ఎయిమ్స్‌ కూడా జిల్లాకే..
రంగారెడ్డి జిల్లా యవనికపై మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. దేశంలో అత్యున్నత వైద్యసేవలందించే అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు జిల్లా వేదిక కానుంది. ఈ మేరకు ఎయిమ్స్‌ ఏర్పాటుకు తగినంత భూమిని గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. ఎయిమ్స్‌ ఏర్పాటుపై వివిధ ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వం.. రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో దీన్ని స్థాపించడం ద్వారా ఎక్కువ మందికి వైద్యసేవలందించవచ్చని భావించింది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్‌ సముదాయాన్ని నిర్మించనున్నందున.. దానికి తగ్గట్టుగా భూమిని గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది.

కేవలం ఆస్పత్రేగాకుండా.. మెడికల్‌ కాలేజీ, వైద్యులు, ఇతర సిబ్బందికి క్వార్టర్లు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలా ఎయిమ్స్‌ను డిజైన్‌ చేస్తున్నారు. దీంతో కనిష్టంగా 200 ఎకరాలు కావాలని కోరుతున్నట్లు తెలిసింది. కాగా, భూమి కేటాయింపుపై జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. రెండేళ్ల క్రితం ఎయిమ్స్‌ కోసం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో భూమిని పరిశీలించారు. దీనితోపాటు సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌లోని భూమిని కూడా ఎయిమ్స్‌కు ప్రతిపాదించాలని భావిస్తున్నారు. ఇవేగాకుండా మరిన్ని భూములతో కూడిన ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు