రెడ్డి పోరుయాత్ర.. ఉద్రిక్తత

13 Oct, 2017 01:09 IST|Sakshi

ఐక్యవేదిక నాయకుల ముందస్తు అరెస్టులు

అరెస్టులను నిరసిస్తూ 44వ ఎన్‌హెచ్‌పై నాయకుల ఆందోళన

కిలోమీటర్లమేర ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌: శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తమపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆందోళనలకు కారణమయ్యారని రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, అధ్యక్షుడు ఏనుగు సంతోశ్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు చేసి, రెడ్డిలను హింసించిన బాలానగర్‌ డీసీపీ సాయిశేఖర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, పేదలను ఆదుకోవడానికి కమిషన్‌ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌లతో పది రోజులుగా ఉత్తర తెలంగాణలో సాగిన రెడ్డి ఐక్యవేదిక పోరుయాత్ర (పాదయాత్ర) మేడ్చల్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నెల 2న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నుంచి ప్రారంభమయిన యాత్ర బుధవారం రాత్రి పాదయాత్ర ద్వారా మేడ్చల్‌ మండలానికి చేరుకుంది. అత్వెల్లి పరిధిలోని శివాలయంలో రాత్రి బసచేశారు. గురువారం ఉదయం అత్వెల్లి నుంచి ప్రారంభమై, కొంపల్లిలో బహిరంగ సభతో ముగించాలని నేతలు ముందస్తుగా నిర్ణయించుకున్నారు.

ఆ మేరకు అక్కడి శివాలయం ఆవరణలో దాదాపు 10 వేల మందికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు.  అంతమంది రావడంపై సమాచారం అందుకున్న పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌ కొందరు రెడ్డి ఐక్యవేదిక నాయకులను అరెస్ట్‌ చేసి శివార్లలోని స్టేషన్లకు తరలించారు. అరెస్టులను నిరసిస్తూ సభ్యులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఇదే సమయంలో రాంరెడ్డి, సంతోశ్‌రెడ్డిలు సంఘం నేతలతో కలసి అత్వెల్లి నుండి పాదయాత్ర ప్రారంభించారు. వారు జాతీయ రహదారిపై  సెయింట్‌ క్లారెట్‌ పాఠశాల వద్దకు రాగానే వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి రింగురోడ్డు మీదుగా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో  సభ్యులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య వచ్చి ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోవడంతో పోలీస్‌లు గుంపులను చెదరగొట్టారు. పలువురికి గాయాలయ్యాయి. అనంతరం రాంరెడ్డి, సంతోశ్‌రెడ్డిలు మాట్లాడుతూ.. తాము పోలీసుల అనుమతితోనే పాదయాత్ర చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన యాత్ర మేడ్చల్‌లో పోలీసుల కారణంగా ఉద్రిక్తతకు దారితీసిందన్నారు. 

మరిన్ని వార్తలు