కీలక పరిణామం.. కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

కీలక పరిణామం.. కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే

Published Wed, Oct 18 2023 10:32 AM

Medchal Ex MLA Malipedhi Sudheer Reddy joined the Congress - Sakshi

సాక్షి, మేడ్చల్‌: ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు మరో నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి హస్తం గూటికి చేరనున్నారు. టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. రేవంత్‌రెడ్డి ఇవాళ సుధీర్‌రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

మలిపెద్ది సుధీర్‌ రెడ్డి 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున మేడ్చల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్‌ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రి వర్గంలోకి చేర్చుకుంది.

తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు. బీఆర్‌ఎస్‌లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సుధీర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సుధీర్‌ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి దక్కే ప్రయత్నం చేశారు.  
 
సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు.. 2023 ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతుండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగింది. బీఆర్‌ఎస్‌లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేని, నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్‌రెడ్డి చాలా కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సుధీర్‌రెడ్డికి బంధుత్వం కూడా ఉంది.

అయితే, తనకు అసెంబ్లీ టికెట్‌ ఇస్తేనే కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తానని సుధీర్‌ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కానీ మేడ్చల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్‌ గౌడ్‌ వంటి నేతలు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సుధీర్‌రెడ్డి మాత్రం తనకు టికెట్‌ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్‌ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్‌ఎస్‌ ఓట్లూ తాను పొందగలనని, టికెట్‌ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది. 

ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా..
నల్లగొండ మున్సిపాలిటీలో మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్‌లోకి చేరారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి చేరారు. మరో నలుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
చదవండి: మన పార్టీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా?

Advertisement
Advertisement