-

ఆసిఫ్‌నగర్‌లో ఉద్రిక్తత

4 May, 2018 11:17 IST|Sakshi
గ్రామ పంచాయతీ ఎదుట గుమిగూడిన ఇరువర్గాలు

కొత్తపల్లి(కరీంనగర్‌) : కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో బీ.ఆర్‌.అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాల ఏర్పాటు వివాదానికి దారితీసింది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆసిఫ్‌నగర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గల రామాలయం పక్కన అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ఓవర్గం గద్దెను నిర్మించారు. గ్రామపంచాయతీ సమీపంలో మరోవర్గం గాంధీ విగ్రహ నిర్మాణానికి గద్దెను నిర్మించారు. అయితే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా గ్రామపెద్దలు సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. చివరికి గురువారం ఉదయం అంబేద్కర్‌ విగ్రహం గద్దెపై ప్రతిష్ఠించేందుకు ఒక వర్గం ప్రయత్నించగా, మరొక వర్గం వ్యతిరేకించడంతో వివాదం మొదలైంది. దీనికితోడు కరీంనగర్, బద్దిపల్లి, ఖాజీపూర్, ఎలగందులనుంచి ఒకవర్గం నాయకులు రావడంతో ఆసిఫ్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

ఈ విషయాన్ని గమనించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలతో డీసీపీ సంజీవ్‌కుమార్, తహసీల్దార్‌ వి.వినోద్‌రావు, కరీంనగర్‌రూరల్, టౌన్‌ ఏసీపీలు టి.ఉషారాణి, పి.వెంకటరమణ సమావేశమయ్యారు. వారి సూచనలపై సానుకూలంగా స్పందించిన ఇరువర్గాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండు విగ్రహాల ఏర్పాటుకు అంగీకరించారు. దీంతో వివాదానికి తెరపడింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు భూమిపూజ చేశారు.

మరిన్ని వార్తలు