-

అంబేడ్కర్‌ స్మృతివనం చరిత్రాత్మకం

28 Nov, 2023 05:48 IST|Sakshi
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణ పనులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: ప్రజల మధ్య ఐక్యతను, సుహృ­ద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో అంబేడ్కర్‌ స్మృతివనం కీలకపాత్ర పోషి­çస్తుం­దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ (సామాజిక న్యాయానికి చిహ్నం) కాన్సెప్ట్‌గా అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుచేస్తున్నా­మన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో సోమ­వారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్మృతివనం, విగ్రహం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మా­ణం పూర్తిచేసే విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అవి..
►అంబేడ్కర్‌ స్మృతివనంలో కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు కూడా పూర్తికావాలి. ఇందులో పక్కాగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీని నిర్వహ­ణను సమర్ధవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. 
►స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టి­ప­డేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలి. 
►నడకదారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలి. 
►ఈ పనులన్నింటిపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. 
► విగ్రహం, స్మృతివనం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్‌ లేకుండా నిర్ధేశించు­కున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలి.

జనవరి 15 నాటికి పనులు పూర్తిచేస్తాం
అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని జనవరి 24న ప్రారంభించేలా ఏర్పాట్లుచేస్తున్నామని, అన్ని పను­లను జనవరి 15 నాటికి పూర్తిచేస్తా­మని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు తెలిపా­రు. సమీక్ష సందర్భంగా పనుల పురోగతిని అధికారులు వివరించారు. స్మృతివనంలో 81 అడుగుల ఎత్తయిన పీఠంపై 125 అడుగుల  అంబేడ్కర్‌ విగ్రహం ఉంటుందన్నారు. దీంతోపాటు విజయవాడ  కృష్ణలంక ప్రాంతంలో కృష్ణా నదికి నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అధి­కారులు ముఖ్యమంత్రికి వివరించారు.

దానికి ఆనుకుని పార్కు, వాకింగ్‌ ట్రాక్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయని కూడా అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపా­లక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మి, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు, విజయ­వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

స్మృతివనం పనులు పరిశీలించిన మంత్రులు
సమీక్ష సమావేశానంతరం అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం పనులను ఉప­ముఖ్య­మంత్రి కొట్టు సత్య­నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునతోపాటు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు, ఇతర అధి­కారులు సోమవా­రం పరిశీలించారు. ఈ సం­దర్బంగా కొట్టు సత్యనారాయణ మీడి­యాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ ఆశయాల స్ఫూర్తితో సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో బడుగు బల­హీన వర్గాల అభ్యు­న్నతికి విశేష కృషిచేస్తు­న్నారని కొనియా­డారు.

రాష్ట్రంలో సామాజిక అం­త­రాలను తొల­గించి సమ­స­మాజ స్థాప­నకు కృషిచేస్తు­న్నా­రన్నారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లా­­డుతూ అంబేడ్కర్‌ స్ఫూర్తిని భావితరా­లకు అందించేందుకు సీఎం జగన్‌ గొప్ప సంకల్పంతో స్మృతివనాన్ని నిర్మి­స్తు­న్నారన్నారు. రూ.400 కోట్లతో అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి­వనం రూపుదిద్దుకుంటోంద­న్నారు. చివరి దశ­లో ఉన్న పనులను సత్వరం పూర్తిచేసి ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు