మూసీలో వాజ్‌పేయి చితాభస్మం నిమజ్జనం

24 Aug, 2018 10:15 IST|Sakshi
వికారాబాద్‌లో అస్థికలతో ర్యాలీగా వస్తున్న ప్రజలు, బీజేపీ నాయకులు

హాజరైన ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

అనంతగిరి : భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని మూసీ జన్మస్థలంలో వాజ్‌పేయి అస్థికలు, చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు. వాజ్‌పేయి అస్థికలు తీసుకువచ్చిన హైదరాబాద్, లంగర్‌హౌస్, ఆరెమైసమ్మ, మెయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌ పట్టణంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ప్రజలు, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

అడుగడుగునా పూలమాలలు వేసి ఘనంగా సాగనంపారు మూసీ నదిలో కర్మయోగి వాజ్‌పేయి అస్థికలు నిమజ్జనం చేయడం ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తున్నామని ప్రజలు అభిప్రాయపడ్డారు. అస్థికల ర్యాలీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న తర్వాత గంగమ్మకు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చితాభస్మం, అస్థికలను నిమజ్జనం చేశారు.

అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ ఇద్దరు ఎంపీలున్న పార్టీని దేశంలోనే అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు.

వాజ్‌పేయి అస్థికలను మూసీలో నదిలో కలపడానికి తాము వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన నదుల్లో వాజ్‌పేయి అస్థికలు కలుపుతున్నట్లు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాల కోసం ఆఖరువరకు పాటుపడిన నేత వాజ్‌పేయి అని కొనియాడారు. తన హయాంలో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లు వేయించారని గుర్తుచేశారు. దేశంలో గ్రామగ్రామా మహిళలకు గ్యాస్‌ పంపిణీని గ్రామగ్రామన అందేలా చేశారని కొనియాడారు.

కార్గిల్‌ యుద్ధంలో సైతం అగ్ర దేశాలు ఆంక్షలు విధించినా ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటిన ప్రధానిగా ఖ్యాతిగడించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు, రాష్ట్ర నాయకులు శేరి నర్సింగ్‌రావు, బొక్కా నర్సింహరెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, సీనియర్‌ నాయకులు పాండుగౌడ్, మాధవరెడ్డి, సదానంద్‌రెడ్డి, రమేష్‌కుమార్, శివరాజు, సుచరితరెడ్డి,సాయికృష్ణ, రవిశంకర్, పోకల సతీష్, నరోత్తంరెడ్డి, కేపీరాజు, రాచ శ్రీనివాస్‌రెడ్డి, నందు, శంకర్, అమరేందర్‌రెడ్డి, సాయిచరణ్‌ రవితేజ పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు