ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్లకు న్యాసి అవార్డు 

15 Aug, 2018 02:44 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ప్రతిష్టాత్మక జాతీయ సైన్స్‌ అకాడమీ (న్యాసి) యంగ్‌ సైంటిస్ట్‌ ప్లాటినం జూబ్లీ అవార్డు–2018కి ఎంపికయ్యారు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కేటగిరీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుష్మీ బధూలికకు, బయోమెడికల్, మాలిక్యులర్‌ బయాలజీ, బయో టెక్నాలజీ కేటగిరీలో బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌లకు ఈ అవార్డు దక్కింది. ఫెక్సిబుల్‌ నానో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో కెమికల్స్‌పై పరిశోధన చేస్తున్న సుష్మీ బధూలిక ఆరోగ్య రంగంలో తక్కువ ఖర్చుతో కూడిన బహుళ ప్రయోజనాలు కలిగిన నానో సెన్సార్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

శక్తి నిలువకు సంబంధించి పర్యావరణ హిత ఎలక్ట్రానిక్స్, పేపర్‌ ఎలక్ట్రానిక్స్, సూపర్‌ కెపాసిటర్ల రూపకల్పనలో పరిశోధనలు చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ప్లాస్మోనిక్‌ నానో స్పేస్‌ లేబొరేటరీ (పీన్యాస్‌ ల్యాబ్‌) అధిపతిగా పనిచేస్తున్న అరవింద్‌ కుమార్, కేన్సర్‌ నానో టెక్నాలజీ రంగంపై పరిశోధనలు చేస్తున్నారు. కేన్సర్‌ చికిత్సలో కీలకమైన నానో మెడిసిన్స్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన పనిచేస్తున్నారు. గతంలో వీరిద్దరు పలు అవార్డులు అందుకున్నారు.

అవార్డు దక్కడం హర్షణీయం.. 
ఐఐటీ హైదరాబాద్‌లో చేరినప్పటి నుంచి నానో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పనిచేస్తున్నా. ఇక్కడ శ్రమించే తత్వం ఉన్న విద్యార్థులకు అనువైన వాతావరణం ఉంది. నేను చేస్తున్న పరిశోధనలకు దేశవ్యాప్తంగా ప్రముఖ పరిశోధన సంస్థల నుంచి గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. పరిశోధన రంగంలో మహిళలకు అంతగా గుర్తింపు లేని వాతావరణంలో అవార్డు దక్క డం హర్షణీయం.’  
 – డాక్టర్‌ సుష్మీ బధూలిక 

ఆనందంగా ఉంది 
ప్రఖ్యాత జాతీయ సైన్స్‌ అకాడమీ నుంచి అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధన శాలలో నాతో పాటు శ్రమిస్తున్న విద్యార్థులకు ఈ ఘనత దక్కుతుంది.              
– డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌

మరిన్ని వార్తలు