మీ వాహనం అమ్మేశారా..?

16 Sep, 2019 11:58 IST|Sakshi
అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాహనాలు

వెంటనే యాజమాన్య హక్కులు మార్చుకోండి

లేదంటే ఈ–చలనా భరించక తప్పదు

జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల వాహనాలు

కొత్త చలాన్లతో అమ్మిన వారికీ తప్పని ఇబ్బందులు

పెద్దశంకరంపేట(మెదక్‌): పాత వాహనాల అమ్మకం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అసలైన యజమానులు ఆర్థికంగా నష్టపోక తప్పదు. ఇటీవలె పెరిగిన ఈ–చలాన్లతో ఇబ్బందులు భారీగానే ఎదురవుతున్నాయి. ఆరు నెలల క్రితం పాత వాహనాన్ని అమ్మిన ఓ వాహనదారుడికి ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. పాత వాహనాన్ని అమ్మిన సమయంలో కేవలం చిన్నపాటి బాండ్‌పేపర్‌పై అమ్మక ఒప్పందాలు చేసుకొని వాహనాన్ని అమ్మేశాడు. సదరు వాహనాన్ని కొనుగోలు చేసి న వ్యక్తి వాహనాన్ని తనపేరుపై రిజిస్ట్రేషన్  చేసుకోకుండా అలాగా నడిపిస్తుండడంతో పాత యజమానికిపై ఈ–చలాన్  భారం పడింది. ఈ విషయాన్ని సదరు అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో లబోదిబోమంటున్నా డు.  జిల్లా వ్యాప్తంగా నిత్యం పాత, కొత్తవాహనాల కొనుగోలు ఎప్పటికప్పుడు పెరుగుతూపోతుంది. ఇటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. సరైన అవగాహన లేక ఇటు అమ్మకందారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. 

జిల్లాలో 35 శాతం పాతవారే యజమానులు
జిల్లాలో అనేక రకాల వాహనాలు కలిపి నాలుగు లక్షల వరకు ఉండగా ఇందులో దాదాపు 35 శాతం వరకు పాత వాహనాల యజమానుల వాహనాలు వినియోగించే వారున్నారు. వాహనాన్ని కొనుగోలు చేసిన వారం, పది రోజుల్లోనే యాజమాన్య హక్కులను మార్చుకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. యాజమాని వాహన విషయంలో మార్పులు చేసుకొనే సమయాన్ని జాప్యం చేస్తే జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

పన్నుల భారం తప్పదు
పాత వాహనాలు అమ్మిన వారు నూతన వాహనం కొనుగోలు చేస్తే పన్నుల రూపంలో అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనదారులకు 9 శాతం, కారుకు 12 శాతం జీవితకాలం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాత వాహన యజమాని అదనంగా మరో వాహనాన్ని కొనుగోలు చేస్తే ద్విచక్రవాహనానికి, కారుకు 14 శాతం చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ విషయంపై అవగాహన లేక అదనంగా పన్నులు చెల్లిస్తున్నారు. 

29,30 ఫారాలపై సంతకాలు తీసుకోవాలి
వాహనాలను కొనుగోలు చేసే సమయంలో వెంటనే ఆర్సీ, బీమా, కాలుష్యం, చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫారం నెంబర్‌ 29, 30లపై వాహనాన్ని విక్రయించిన వారి సంతకాలు, ఆధార్‌ జీరాక్స్‌ను తీసుకుంటే వాహన పత్రాల బదిలీ సులభమవుతుంది.

మరిన్ని వార్తలు