ఓటర్లలో రికార్డు చైతన్యం..!

2 Dec, 2018 10:38 IST|Sakshi
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ శ్వేతామహంతి, ఎస్పీ అపూర్వారావు, అధికారులు

సాక్షి, వనపర్తి : వచ్చే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు.. వనపర్తిలో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్వేతామహంతి సారథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల క్రీడామైదానంలో శనివారం ఓటరు చైతన్యం కోసం ఏకకాలంలో 6,300 మంది విద్యార్థులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, స్థానికులతో పాటు కలెక్టర్‌ శ్వేతామహంతి, ఎస్పీ కె.అపూర్వారావు, అధికారులు ఓటర్లను చైతన్యం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు హాజరై రికార్డు ధవీకరణ పత్రంతో పాటు బంగారు పతకం అందజేశారు.

ఓటింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అ«ధికారి సూచన మేరకు నెల రోజులుగా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు ఇప్పుడు జిల్లా విద్యాశాఖ సహకారంతో డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు పేరున ప్రకటించారు.


ఈవీఎంలపనితీరు ఇలా...
కల్వకుర్తి టౌన్‌ : సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఈవీఎంలను వినియోగిస్తోంది. ఈవీఎంకు రెండు యంత్రాలు అనుసంధానంగా ఉంటాయి. ఇవే సీయూ(కంట్రోల్‌ యూనిట్‌), బీయూ (బ్యాలెట్‌ యూనిట్‌). పోలింగ్‌ స్టేషన్‌లోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది. ఓటర్లు బీయూలో ఓటు వేయాల్సి ఉంటుంది.

ఓటరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అధికారి సీయూలోని బ్యాలెట్‌ బటన్‌ను నొక్కితేనే ఓటు వేసేందుకు అనుమతి లభిస్తుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ అభ్యర్థులు ఉండి గుర్తులు కేటాయించాల్సి వస్తే మరో యంత్రాన్ని వినియోగిస్తారు. అభ్యర్ధులు పది మంది కంటే తక్కువగా ఉంటే ఎందరు అభ్యర్ధులు పోటీలో ఉంటే అన్ని గుర్తులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తారు.

ఎన్నికల అధికారి సీయూలో బ్యాలెట్‌ బటన్‌ నొక్కగానే ఓటు వేసేందుకు వెళ్లిన ఓటరు వద్ద ఉన్న బీయూలోని బల్బు వెలుగుతుంది. అప్పడు బీయూలోని అభ్యర్ధుల గుర్తుల్లో తమకు నచ్చిన అభ్యర్ధి గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్‌ను నొక్కితే ఓటింగ్‌ పూర్తయినట్లు, ఈ ప్రక్రియ పూర్తికాగానే బల్బు ఆగిపోతుంది. అప్పుడు మరో ఓటరును పంపిస్తారు. బీయూలో అభ్యర్ధులందరీ గుర్తుల తర్వాత నోటా గుర్తు ఉంటుంది. అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో నోటాను ఎంచుకోవచ్చు. 

మరిన్ని వార్తలు