శిశు విక్రయం!

16 Feb, 2015 05:53 IST|Sakshi

కౌడిపల్లి: నెలరోజుల ఆడశిశువు విక్రయం జరిగింది. గ్రామస్థులు మందలించడంతో ఆ తల్లిదండ్రులు తమ శిశువును ఇంటికి తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఆదివారం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా... కౌడిపల్లి మండలం బతుకమ్మ తండాకు చెందిన దెవాసోత్ గోప్య, నిర్మల దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంధ్య, కీర్తి ఉన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం  సంక్రాంతి పండుగ రోజున నిర్మల మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ కావడంతో సుమారు రూ.25 వేలు ఖర్చయ్యింది.

కాగా శనివారం కౌడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి తమ నెల రోజుల వయస్సున్న పసిపాపను విక్రయించారు. విషయం తండావాసులకు తెలిసి వారు మందలించడంతో తిరిగి ఆ చిన్నారిని ఆదివారం ఇంటికి తెచ్చుకున్నారు. ఈ విషయమై గోప్యను వివరణ కోరగా.. కూలీ పనులు చేసుకుని బతికే తమకు ఉన్న ఇద్దరూ భారమయ్యారు. మరో అమ్మాయిని పోషించే స్థోమత లేక శిశువును దత్తత ఇవ్వాలని చూశాను తప్ప విక్రయించలేదన్నారు.
 
పేదరికమే కారణమా...?
తండాల్లో శిశు విక్రయాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే పేద కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలను విక్రయిస్తున్నారు. తాజాగా కౌడిపల్లి బతుకమ్మ తండాలో శిశు విక్రయం వెలుగు చూసింది. కూలి పనులు చేసుకునే గోప్య నెలరోజుల క్రితం పుట్టిన శిశువును పోషించే స్థోమత లేక బేరం పెట్టినట్టు తెలుస్తోంది. ఈయన తన తండ్రి నుంచి రెండేళ్ల క్రితం వేరుపడ్డాడు. వాటా కింద కేవలం పదిగుంటల సాగుభూమిని మాత్రమే వచ్చింది. దీంతో సాగు పూర్తిస్థాయిలో చేయలేక కూలి పనులు చేసుకుంటున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో మూడో సంతానాన్ని విక్రయించాడు. స్థానికుల ఒత్తిడి భరించలేక ఎట్టకేలకు తిరిగి తెచ్చుకున్నాడు.

మరిన్ని వార్తలు