28న తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీల బంద్‌

17 Feb, 2018 03:51 IST|Sakshi
వివేక్‌ వినాయక్‌

హైదరాబాద్‌: గిరిజనులు గిరి గీసి బరిలోకి దిగుతున్నారు. హక్కుల కోసం ఉద్యమబాట పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బీసీ కులాలను ఎస్టీ జాబితాలో కలిపేందుకు యత్నించడాన్ని నిరసిస్తున్నారు. హామీల అమలు, హక్కుల పరిరక్షణకు ఈ నెల 28న తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు గిరిజన ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు కె. వివేక్‌ వినాయక్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను గిరిజన నేతకు ఇవ్వకపోవడం దారుణమని, ఒక్క నామినేటెడ్‌ పోస్టులోనూ గిరిజనులు లేరని అన్నారు.

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాల్లో 1,250 గ్రామాల్లో 50 శాతం మించి గిరిజన జనాభా ఉండగా కేవలం 108 గ్రామాలనే షెడ్యూల్డ్‌ ప్రాంత జాబితాలో చేర్చారని, మిగిలినవాటిని కూడా అందులో చేర్చాలని అన్నారు. బోయ, వాల్మీకి కులాలను షెడ్యూల్డ్‌ తెగల జాబి తాలో కలపాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తీర్మానం చేయడాన్ని, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో కలిపేందుకు పోరాటం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. గిరిజన వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఈ నెల 20న విశాఖ జిల్లా జీకే వీధిలో గిరిదీక్ష, 21న ప్రభుత్వాలు, పవన్‌కల్యాణ్‌ దిష్టిబొమ్మల దహనం, 28న రెండు రాష్ట్రాల ఏజెన్సీ బంద్, మార్చ్‌ 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద అన్ని గిరిజన సంఘాలు, గిరిజన ప్రజా ప్రతినిధులతో కలిసి ‘గిరి దీక్ష’చేయనున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు