దత్తాత్రేయ అందరి మనిషి

14 Sep, 2019 02:12 IST|Sakshi
గవర్నర్‌ దత్తాత్రేయను సన్మానిస్తున్నఆర్‌.కృష్ణయ్య, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తదితరులు  

హిమాచల్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు పౌర సన్మాన సభలో వక్తలు

గన్‌ఫౌండ్రి : హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అందరి మనిషి అని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ గా ప్రమాణస్వీకారం చేసిన బండారు దత్తాత్రేయకు శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌర సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి దత్తాత్రేయ అని కొనియాడారు. బీసీలు ఎదుర్కొంటున్న అసమానతలను దూరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ..గవర్నర్‌ పదవికి దత్తాత్రేయ వన్నె తేవాలని, భవిష్యత్‌లో మరిన్ని పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..అందరినీ కలుపుకుపోయే గొప్ప గుణం ఉన్న వ్యక్తి దత్తన్న అని ప్రశంసించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను బీసీ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీ డీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సినీనటుడు సుమన్, జస్టిస్‌ చంద్రకుమార్‌ , విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వినోద్‌కుమార్‌ అగర్వాల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, పలు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు