పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

7 Apr, 2018 09:45 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ సురేంద్రమోహన్‌

సూర్యాపేట : వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ సురేంద్రమోహన్‌ ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున మార్చి 24న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన శాసనసభ ఎన్నికల జాబితాను తీసుకొని దాని ప్రకారం అసెంబ్లీ పరిధిలోని గ్రామ పంచాయతీలు వాటి వార్డుల వారీగా క్రమ సంఖ్య ప్రకారం ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ఏ పార్ట్‌లలో, ఏ సీరియల్‌ నెంబర్‌ ఉన్నది, ఏ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నది అనే విషయాలను మాన్యువల్‌గా తయారు చేసుకొని అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు లెవల్‌1, లెవల్‌2 రూట్‌ అధికారులు, జోనల్‌ అధికారులు, ఎన్నికల అధికారులు ఉంటారని పేర్కొన్నారు. అదే విధంగా సంయుక్త కలెక్టర్, డీఆర్‌ఓ లెవల్‌1, డివిజనల్‌ అధికారులు లెవెల్‌2 అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. 
రిజర్వేషన్లు గుర్తించే బాధ్యత ఆర్‌డీఓలదే..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు గుర్తించే బాధ్యత ఆర్‌డీఓలపై ఉంటుందని పేర్కొన్నారు. జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తదుపరి మాత్రమే రిజర్వేషన్‌ ధ్రువీకరించి ప్రకటించాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహించే ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పొరపాటు జరిగినా ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, తగు జాగ్రత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కొత్త గ్రామ పంచాయతీల గుర్తింపు, పాత పంచాయతీల వివరాలతో జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనలు ఎలాంటి మార్పులు లేకుండా ప్రభుత్వం ఆమోదించిందని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక సమాచారం అందుతుందని అన్నారు. ముఖ్యంగా ఓటర్లు ఏ వార్డుకు సంబంధించిన వారు అదే వార్డుల్లో ఉండే విధంగా చూడాలని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు తయారు చేసిన జాబితాను ఎంపీడీఓలు పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ సంజీవరెడ్డి, డీఆర్‌ఓ యాదిరెడ్డి, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు మోహన్‌రావు, భిక్షునాయక్, డీపీఓ రామ్మోహన్‌రాజు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎండబ్ల్యూఓ శ్రీనివాస్, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు