నిఘా నీడలో భైంసా

25 Sep, 2015 03:03 IST|Sakshi
నిఘా నీడలో భైంసా

- శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి
- ఎస్పీ తరుణ్‌జోషి
ఆదిలాబాద్‌క్రైం :
భైంసాలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగే ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ తరుణ్‌జోషి అన్ని చర్యలు తీసుకున్నారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో భైంసా గణేష్ నిమజ్జన శోభాయాత్రపై బందోబస్తు అంశాలను చర్చించారు. డివిజన్‌లో అదనపు బలగాలు మొహరించాలని తెలిపారు.

గణేష్ శోభాయాత్ర, బక్రీద్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకుని తెలంగాణ రాష్ట్రానికి శాంతి సందేశాన్ని పంపి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎటువంటి పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండకూడదని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, పూర్తిగా నిషేధించామని తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు కలిగితే డయల్ 100కు లేదా, భైంసా డీఎస్పీ రాములు సెల్ 9440795076లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పనసారెడ్డి, జీఆర్ రాధిక, స్పెషల్ బ్రాంచ్‌ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఎస్సైలు టీడీ నందన్, కరీం, వెంకటస్వామి, అన్వర్, మల్లేష్, సురేష్ పాల్గొన్నారు.
 
బందోబస్తు వివరాలు..

అదనపు ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు     ఎనిమిది మంది, సీఐలు 20 మంది, ఎస్సైలు 50 మంది, ఏఎస్సైలు 40, హెడ్‌కానిస్టేబుళ్లు    210, కానిస్టేబుళ్లు 300 మంది, సాయుధ బలగాలు 110, హోంగార్డులు 200 మంది, మహిళా పోలీసులు 40,
 నిఘా వర్గాలు 25, డాగ్‌స్క్వాడ్ 3, బాంబు నిర్వీర్య బృందాలు 8, లైట్ డిటెక్టివ్ బృందాలు 12 పాల్గొంటాయి.

మరిన్ని వార్తలు