నగరాల్లో సైకిళ్లకూ మార్గాలుండాలి

5 Nov, 2017 03:00 IST|Sakshi

 అర్బన్‌ మొబిలిటీ ఇండియా సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య

     సమగ్ర రవాణా వ్యవస్థతోనే ట్రాఫిక్‌ కష్టాలకు చెల్లు

     ప్రజారవాణా పెంపుతోనే వాయు, శబ్ద కాలుష్యాల తగ్గుదల

     ప్రయాణాల్లో సమయం వృథాతో తగ్గుతున్న వ్యక్తుల ఉత్పాదకత

     హైదరాబాద్‌లో ప్రారంభమైన మూడు రోజుల సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో నగరాల్లో రవాణా వ్యసవ్థలను సుస్థిర పద్ధతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్‌ జామ్‌ల నివారణకు ప్రజారవాణా వ్యవస్థలను పటిష్టం చేయడంతోపాటు పాదచారులు, సైక్లిస్టులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్‌లో అర్బన్‌ మొబిలిటీ ఇండియా సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య కీలకోపన్యాసం చేశారు. రవాణా సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే నగరాల్లో మళ్లీ సైకిళ్లను అందుబాటులోకి తేవాలన్నారు. స్మార్ట్‌ సిటీస్‌ ద్వారా ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వెంకయ్య...కాలుష్యకారక వాహనాల నియంత్రణ, ఎలక్ట్రిక్‌ బస్సుల వాడకం, పార్కింగ్‌ లేకుంటే కొత్త కార్ల కొనుగోళ్లకు నిరాకరించడం వంటి చర్యల ద్వారా నగరాల్లో రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చన్నారు.

ప్రయాణాల్లోనే గంటల సమయం వృథా
దశాబ్దాలుగా అనేక దేశాల్లో నగరాలు వేగంగా విస్తరించాయని, ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల వాడకమూ పెరిగి ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలకు దారితీసిందని వెంకయ్యనాయుడు చెప్పారు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న విషవాయు ఉద్గారాల్లో నాలుగో వంతు నగర ప్రాంత రవాణా వ్యవస్థల ద్వారానే వస్తుండటం గమనార్హమన్నారు. వాయు, శబ్ద కాలుష్యాల ప్రభావం ప్రజారోగ్యంపైనా పడుతోందని... నగరాల్లో ప్రయాణాల్లోనే గంటల సమయం గడచిపోతుండటం వ్యక్తుల ఉత్పాదకత, వ్యాపారాలనూ దెబ్బతీస్తోం దన్నారు. దేశంలో బస్సులు, మెట్రోల వంటి ప్రజారావాణ వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోందని, 2011 నాటికి ప్రజారవాణాలో వాటి భాగస్వామ్యం 30 శాతం వరకు ఉండగా 2021 నాటికి అది 22 శాతానికి తగ్గిపోనుందన్నారు. సమర్థ రవాణా వ్యవస్థల లేమి ప్రభుత్వేతర రవాణా ఏర్పాట్లకు కారణమవుతోందన్నారు. ఈ సమస్యల న్నింటినీ పరిష్కరించేందుకు పెరుగుతున్న జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌ రవాణా వ్యవస్థలకు రూపకల్పన చేయాలన్నారు. వాయు, శబ్ధ కాలుష్యాలను తగ్గించేందుకు భారీగా ప్రజారవాణ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన అవసరముం దని వెంకయ్య సూచించారు.

ప్రభుత్వాలు వినూత్న పద్ధతుల్లో ఆలోచించాలి
భారీ పెట్టుబడులతో కూడుకున్న మెట్రో రైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్న పద్ధతుల్లో ఆలోచించాలని, పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యాలకు అవకాశం కల్పించాలని వెంకయ్య సూచించారు. ఇదే పద్ధతిలో సిద్ధమవుతున్న హైదరాబాద్‌ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య వ్యవస్థ అని గుర్తుచేశారు. అంతకుముందు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి హర్‌దేవ్‌సింగ్‌ పూరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో దాదాపు 380 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాలు పూర్తవగా మరో 500 కిలోమీటర్లు నిర్మాణంలో ఉందన్నారు. దేశంలో 90 శాతం మంది బస్సులు, రైళ్ల వంటి ప్రజారవాణా వ్యవస్థలపై ఆధారపడుతుంటే మిగిలిన 10 శాతం మంది ప్రైవేటు వాహనాలతో రోడ్లను ఆక్రమిస్తున్నారన్నారు. సంపన్న వర్గాలు కూడా తమ ప్రైవేట్‌ వాహనాల స్థానంలో బస్సులను వాడటం మొదలుపెడితే రవాణా సమస్యలు గణనీయంగా తగ్గుతాయని సూచించారు. సదస్సులో ఫ్రాన్స్‌ సంస్థ కొడాటూ అధ్యక్షుడు డొమినిక్‌ బ్రూసౌ, ఫ్రాన్స్‌ రాయబారి అలెగ్జాండర్‌ జిగ్లర్‌ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. 

మరిన్ని వార్తలు