సహకరిస్తే పరిశీలిస్తాం!

19 Jun, 2018 01:32 IST|Sakshi
కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఎంపీ దత్తాత్రేయ తదితరులు

స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ 

కేంద్రమంత్రిని కలసిన ఎంపీ దత్తాత్రేయ బృందం 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో్ల స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలను సాయమడిగామని.. వారు ఏ మేరకు సహకరిస్తారో పరిశీలించి వెంటనే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ చెప్పారు. బీజేపీ ఎంపీ దత్తాత్రేయ, పార్టీ నేత వెదిరె శ్రీరాం తదితరులతో కూడిన బృందం సోమవారం మంత్రిని కలసి ఈ అంశాలపై చర్చించింది. సమావేశం అనంతరం బీరేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ, ఏపీల్లో స్టీలు ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలత లేదని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నివేదికిచ్చింది.

తర్వాత ఓ ఏజెన్సీ ఏర్పాటు చేశాం. ఆ ఏజెన్సీ కూడా ముడిసరుకు ఐరన్‌ ఓర్‌లో నాణ్యత లేదని తేల్చింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం.  టాస్క్‌ఫోర్స్‌లో రాష్ట్రాల ప్రాతినిథ్యం ఉంది. డిసెంబర్‌లో చివరి భేటీ జరిగింది. 2 రాష్ట్రాలు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంబంధిత సమాచారం కోరాం. మెకాన్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ సాంకేతిక నివేదిక ఇచ్చింది’ అని చెప్పారు 

తెలంగాణ నుంచి ప్రకటన.. 
ప్లాంట్లను ఏర్పాటు చేయబోమని తాము ఎక్కడా చెప్పలేదని బీరేంద్రసింగ్‌ అన్నారు. తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ నుంచి ఒక స్టేట్‌మెంట్‌ వచ్చింది. ఒక కమిటీ ఏర్పాటు చేశామని, ఏ రకమైన సాయం చేస్తారో నెలరోజుల్లో ఒక నివేదిక ఇస్తామని తెలిపారు. ఆ నివేదిక వస్తే టాస్క్‌ఫోర్స్‌ పని పూర్తవుతుంది. తదుపరి మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. పాల్వంచలో ఒక పాత ప్లాంటు ఉంది.  రాష్ట్ర ప్రభుత్వ సాయంతో త్వరలో దీన్నీ తెరుస్తాం. ఏపీలోని వైఎస్సార్‌ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ప్లాంటు విషయంలో ఇదే ప్రక్రియ అమలవుతుంది.

ఆర్సెలర్‌ మిట్టల్‌ సంస్థతో సెయిల్‌ జేవీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగింది. ఆటోగ్రేడ్‌ స్టీలు తయారు చేసేందుకు విశాఖపట్నం సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీ వారితో కూడా మాట్లాడాం. స్థలం ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. ఇంకా సమాచారం రావాల్సి ఉంది’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంటు పెడతామని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. ఏపీ ప్రభుత్వం తొందరపాటు రాజకీయం చేసిందని, అభివృద్ధి కోసం ముందుకు రావాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు