‘గుడి కూలింది.. నీవు కూలతావు’

10 Jul, 2020 20:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం ఎందుకు కూలుస్తున్నాడో అర్థం కావడం లేదు.. నల్లపోచమ్మ గుడి కూల్చినందుకు ప్రజలు ఈ ప్రభుత్వానికి దినం పెడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి కూలింది అంటే నీవు కూలతావు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో ఇతర పార్టీ నాయకలు ఐదు రోజులు కనిపిస్తే.. వారం రోజులు కనిపించడం లేదు. కానీ బీజేపీ నేతలు.. కార్యకర్తలు మాత్రమే నిరంతరం పేదలకు సేవ చేస్తున్నారు. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను తాను చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు సీఎం కేసీఆర్. దేవుడు ఇచ్చిన దానికి పూజారి చెప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. సొమ్మొకడిది సొకొకడిది అన్నట్లు ఉంది కేసీఆర్ తీరు’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో డెడికేటెడ్ ఆసుపత్రులు సరిగా లేవు. బెడ్స్ ఏర్పాటు చేయలేదు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది.  ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. తుపాకీ పేల్చినట్టు మాట్లాడి పోయే ముఖ్యమంత్రితో తెలంగాణ అభివృద్ధి జరగదు. ఎందుకు మాయమైపోతున్నాడని అడిగితే అరెస్ట్‌లు చేస్తున్నారు. కానీ బీజేపీ మిమ్మల్ని ఎదిరించి.. ప్రశ్నిస్తుంది. టీఆర్ఎస్ లాగా కమీషన్.. కాంగ్రెస్‌లాగా కాంట్రాక్టుల పార్టీ కాదు బీజేపీ. ప్రభుత్వం చేస్తున్నది అరెస్ట్‌లు కాదు కిడ్నాప్‌లు. టీఆర్ఎస్ పార్టీ దిగిపోయే రోజు దగ్గర పడింది. మోదీ కంటే ముందు ఉన్న ప్రభుత్వంలో అన్ని స్కాంలే.. మా ప్రభుత్వం వచ్చాక అవినీతి.. స్కాంలకు ఆస్కారం లేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య.. 370 ఆర్టికల్.. త్రిపుల్ తలాక్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. తెలంగాణకు 60ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ చేయలేని సాయం 6 ఏళ్ళలో మోదీ సర్కార్ చేసింది’ అని తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘దేశ సగటు కంటే అదనంగా తెలంగాణకు జాతీయ రహదారులు మంజూరు చేసింది కేంద్రం. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తాడు. గతంలో పటేల్ ముందు నిజాం వంగి దండాలు పెట్టి ఆ తరువాత రజాకార్లను ఎగదోసినట్టు వ్యవహరిస్తున్నాడు కేసీఆర్. విద్యుత్‌ గ్రిడ్‌లను అనుసంధానం చేసి రాష్ట్రంలో 24గంటల కరెంట్ ఇస్తోంది కేంద్రం. విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు వేగవంతం చేసింది. కేసీఆర్ మాయల మరాఠిలా వ్యవహరిస్తున్నాడు. మోదీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు. తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉంది. కాంగ్రెస్ డీఎన్ఏ ఇప్పుడు టీఆర్ఎస్‌కు పట్టింది. కరోనా తెలంగాణ కాదు బంగారు తెలంగాణ కావాలంటే అది బీజేపీతోనే సాధ్యం’ అని మురళీధర్‌ రావు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా