10లో 9 బాలురవే..

10 Jun, 2019 02:11 IST|Sakshi
ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేస్తున్న టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య, ఎంసెట్‌ చైర్మన్‌ వేణుగోపాలరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి

ఇంజనీరింగ్‌ టాప్‌–10లో 9 మంది వారే

 ఏపీ విద్యార్థి రవి శ్రీతేజకు ఫస్ట్‌ ర్యాంకు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగం టాప్‌–10 ర్యాంకుల్లో 9 ర్యాంకులను బాలురే సాధించారు. ఇంజనీరింగ్‌లో టాప్‌ ర్యాంకును ఏపీకి చెందిన కురిశెట్టి రవి శ్రీతేజ కైవసం చేకున్నాడు. ఇంజనీరింగ్‌ టాప్‌ 10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు సాధించగా మరో ఐదు ర్యాంకులను ఏపీ విద్యార్థులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో భూపాలపల్లికి చెందిన ఎంపటి కుశ్వంత్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. ఈ విభాగంలోని టాప్‌–10 ర్యాంకులను సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణ విద్యార్థులు ఉండగా ఏపీ నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను ఆదివారం హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్యతో కలసి ఫలితాలను ఆయన విడుదల చేశారు. 

82.47%.. 93.01%.. 
ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,42,210 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు, 74,989 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు ఉన్నారు.  అగ్రికల్చర్‌ పరీక్షలకు 1,31,209 మంది హాజరవగా అందులో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్‌ ఫార్మసీ పరీక్షలకు 68,550 మంది హాజరుకాగా, వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. విద్యార్థుల ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేశారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్లో పలు దఫాలుగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ చేసి విద్యార్థులకు ర్యాంకులను ఖరారు చేశారు. ఈ ఫలితాల్లో ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో టాప్‌–10 ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లో టాప్‌ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలను కూడా ప్రకటించారు.
 
20 తరువాత కౌన్సెలింగ్‌ 

 ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 తరువాత ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఈసారి జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్‌లో 90 వేల వరకే సీట్లు ఉంటాయని తెలిపారు. జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ వర్సిటీల పరిధిలో  గతేడాది 86 వేల సీట్లు ఉండగా ఈసారి 77,500 వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.    

ఎంసెట్‌ టాపర్ల అభిప్రాయాలు

ఐఐటీలో సీటు సాధిస్తా.. 
నాకు ఇంటర్‌లో 985 మార్కులొచ్చాయి. క్రమపద్ధతిలో చదివినందుకు మంచి ర్యాంకు సాధించా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 33వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ఐఐటీలో సీటు సాధిస్తా. 
– చంద్రశేఖర ఎస్‌ఎస్‌ హేతహవ్య, ఎంసెట్‌ రెండో ర్యాంకు 

కంప్యూటర్‌ ఇంజనీర్‌ అవుతా.. 
నాకు ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 28వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 117వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావడం నా లక్ష్యం. 
– జి.ఆకాశ్‌రెడ్డి, మూడో ర్యాంకు 

రీసెర్చ్‌ అంటే ఇష్టం... 
మా నాన్న నాగవెంకట విశ్వనాథం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో 10 పాయింట్లు సాధించా. ఇంటర్‌లోనూ 10 గ్రేడ్‌ పాయింట్లు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 3వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో కూడా 3వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌ ఫలితాల కోసం చూస్తున్నా. నాకు పరిశోధనలంటే ఇష్టం.
– భాను దత్త, ఎంసెట్‌ ఐదో ర్యాంకు 

ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేస్తా...
నాన్న శ్రీనివాస్‌కుమార్‌ రైల్వేలో సీనియర్‌ టెక్నికల్‌ ఇంజనీర్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీర్‌ చేయాలనే నా లక్ష్యం. ఇంటర్‌లో 984 మార్కులు వచ్చాయి. జేఈఈలో 248 ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. 
– బి.సాయివంశీ, ఎంసెట్‌ ఆరో ర్యాంకు 

సివిల్స్‌ సాధిస్తా... 
నా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో సివిల్స్‌లో మంచి ఉద్యోగం సంపాదించాలనేది నా లక్ష్యం. జేఈఈ మెయిన్స్‌లో 125వ ర్యాంకు సాధించా. 
– గౌరిపెద్ది హితేంద్ర కశ్యప్, 8వ ర్యాంకు  

కార్డియాలజిస్ట్‌ కావాలనుకుంటున్నా... 
మా నాన్న వెంకట కిరణ్‌కుమార్‌ న్యూరో సర్జన్, అమ్మ నాగశ్రీదేవీ గృహిణి. పదో తరగతి, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించా. ఏపీ ఎంసెట్‌లో 107, నీట్‌లో 1292 ర్యాంకు వచ్చింది. కార్డియాలజిస్ట్‌ కావాలనేదే నా లక్ష్యం.
     – ఎం. వెంకటసాయి  అరుణ్‌ తేజ, మూడో ర్యాంకు 

న్యూరో సర్జన్‌ కావడమే జీవితాశయం
మా నాన్న లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమ్మ లక్ష్మి టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నీట్‌లో 55వ ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్‌ కావాలనేది నా ఆశయం.   
   – ఎంపటి కుశ్వంత్, ఫస్ట్‌ ర్యాంకు 

న్యూరో సర్జన్‌ అవుతా... 
మా నాన్న సూర్యభాస్కర రెడ్డి రైల్వే ఉద్యోగి. అమ్మ విజయశాంతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్‌ పాయింట్లు, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించా. నీట్‌లో జాతీయ స్థాయిలో 528 ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు వచ్చింది. న్యూరో సర్జన్‌ అవుతా.   
 – దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెండో ర్యాంకు  

మరిన్ని వార్తలు