నిరాశా బడ్జెట్

1 Mar, 2015 01:54 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జీతాల పెంపుతో సంతోషాల్లో మునిగితేలుతున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పెద్ద షాక్ ఇచ్చారు. ఆదాయ పన్ను రాయితీని యథాయథంగా కొనసాగించడంతో జిల్లాలోని 90 శాతం ఉద్యోగులపై పన్ను భారం పడనుంది. 25 వేల రూపాయల పైచిలుకు జీతం తీసుకున్న ఉద్యోగులంతా ఆదాయపు పన్ను చెల్లించక తప్పదు. దీనివల్ల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులే కాకుండా నాలుగో తరగతి ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున ఆదాయ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 35,222 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 21,533 మంది రిటైర్డు ఉద్యోగులున్నారు.
 
  పెరిగిన వేతనాలతో వీరిలో 90 శాతం మందికిపైగా తాజాగా ఆదాయపు పన్ను పరిధిలోకి రానున్నారు. ఆదాయపు పన్ను రాయితీ పెంచితే కొంతమేరకైనా ఉపశమనం పొందుదామని భావించిన వీరందరికీ నిరాశే ఎదురైంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగానికి పెద్దగా ప్రయోజనాలు కలిగించే అంశాలేవీ ఈ బడ్జెట్‌లో లేకపోవడం గమనార్హం. సిమెంట్ ధరల పెంపుతో తాజాగా ఇంటి నిర్మాణం భారం కానుంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఆశపడుతున్న మధ్యతరగతి వర్గాలకు ఇది మరింత భారం కానుంది.
 
  మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను తగ్గించిన కేంద్రం... వాటికి ఉపయోగించే కేబుల్, డీటీహెచ్, ఇతరత్రా సేవలను పెంచడంతో వాటిని ఉపయోగిస్తున్న జిల్లాల్లోని లక్షలాది మందిపై భారం పడనుంది. టీవీలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలు తగ్గే అవకాశాలు ఉండటంతో ఈ మేరకు అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారు లు భావిస్తున్నారు. ప్రస్తుతం 12 శాతం ఉన్న సే వా పన్నును తాజా బడ్జెట్‌లో 14 శాతానికి పెం చడంతో ఆ మేరకు భారం ప్రజలపై పడనుంది. చివరకు కుటుంబంతో, స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేయాలని ఆశపడే వా రు కూడా పెరిగిన సర్వీస్ ట్యాక్స్‌కు సరిపడా డ బ్బులున్నాయా? లేవా? చూసుకుని వెళ్లాల్సిందే.
 
 ప్రాణహితకు మోక్షం లేనట్లే!
 తెలంగాణకు మణిహారమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్‌లో ఆ ఊసే ప్రస్తావించలేదు. తద్వారా కరీంనగర్ జిల్లాలో 1,71,449 ఎకరాల ఆయకట్టును అందించే ఈ ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం కలిగే అవకాశాలే కన్పించడం లేదు.
 

మరిన్ని వార్తలు