‘బిల్ట్’ పునరుద్ధరణకు సహకరించండి

6 May, 2015 02:02 IST|Sakshi
‘బిల్ట్’ పునరుద్ధరణకు సహకరించండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడియం శ్రీహరి విజ్ఞప్తి
సబ్సిడీపై యూకలిప్టస్ కలప సరఫరా చేయాలని వినతి
 

హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని బళ్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-బిల్ట్ (పూర్వపు ఏపీ రేయాన్స్) ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడును తెలంగాణ ఉప ముఖ్యమం త్రి కడియం శ్రీహరి కోరారు. మంగళవారం సచివాలయ ంలో చంద్రబాబును కలసి ఈ అంశంపై చర్చించారు. అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడటంతో వేలాది మంది వీధిన పడ్డారన్నారు. ప్రధానంగా యూకలిప్టస్ కలప కొరతతో కంపెనీ మూతపడిందని, యూకలిప్టస్ కలప ఉత్పత్తి ఏపీలో 70 శాతం అవుతుంటే తెలంగాణలో 30 శాతం మాత్రమే అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీపై ఫ్యాక్టరీకి తగి నంత యూకలిప్టస్ కలపను సరఫరా చేస్తే ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంటుందన్నారు. ఫ్యాక్టరీ ఏ ప్రాంతంలో ఉందని కాకుండా, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా దాని పునరుద్ధరణకు సహకరించాలని బాబును కోరినట్లు తెలిపారు. దీనిపై బాబు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనిపై తమ నిర్ణయం చెబుతామన్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ సహకరిస్తామన్నారు: ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సహకరిస్తామన్నారని టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాంనాయక్‌లు అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేసీఆర్‌ను కలిశామని, సబ్సిడీ కరెంటు, తగినంత బొగ్గు సరఫరా గురించి అడిగామని, కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌లు చొరవ తీసుకుంటే  వీలైనంత త్వరలో ఫ్యాక్టరీ తెరుచుకునే అవకాశముందన్నారు. ఇప్పటికే కార్మికులు వీధినపడ్డారని, వారిని దృష్టిలో పెట్టుకుని సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు